Bihar Poll Meet: ఇండియా కూటమి మధ్య కుదిరిన సీట్ల పంపకాలు
ABN , Publish Date - Sep 06 , 2025 | 09:42 PM
అహ్లాదకరమైన వాతావరణంలో సమావేశం జరిగిందని, సీట్ల పంపకాలపై భాగస్వామ్య పార్టీలు ఒక విస్తృత అవగాహనకు వచ్చాయని సమావేశానంతరం బిహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ రామ్ తెలిపారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై విపక్ష 'ఇండియా' కూటమి (INDIA Allianace) మధ్య అవగాహన కుదిరింది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) నివాసంలో శనివారంనాడు జరిగిన సమావేశంలో ఈ మేరకు భాగస్వామ్య పక్షాల మధ్య ఒక అవగాహన కుదిరినట్టు పార్టీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 'ఇండియా' కూటమి కింద పశుపతి కుమార్ పరస్ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్ జన్‌శక్తి పార్టీ (RJLP), జార్ఖాండ్ ముక్తి మోర్చా (JMM) కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.
రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్, వామపక్షాలు, వికాశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)లతో పాటు ఆర్జేఎల్‌జేపీకి కూడా సీట్లు కేటాయింపు జరుగుతుంది. ఆర్జేడీ తమ కోటా నుంచి జేఎంఎంకు సీట్లు కేటాయిస్తుంది.
అహ్లాదకరమైన వాతావరణంలో సమావేశం జరిగిందని, సీట్ల పంపకాలపై భాగస్వామ్య పార్టీలు ఒక విస్తృత అవగాహనకు వచ్చాయని సమావేశానంతరం బిహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ రామ్ తెలిపారు. గత ఎన్నికల్లో జరిగినట్టు కాకుండా కాంగ్రెస్, ఇతర పార్టీలు తమకు గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతాయని చెప్పారు. ఈసారి 'ఇండియా' కూటమి కొత్త భాగస్వాములు కూడా చేరడంతో ప్రధాన భాగస్వామ్య పార్టీలు సీట్ల విషయంలో కొంత రాజీపడాల్సి రావచ్చని అన్నారు. ఆర్‌ఎల్‌డీ, కాంగ్రెస్ మధ్య సీట్లపంపకాల్లో గొడవలు ఉన్నాయన్న ఊహాగానాలను ఆయన కొట్టేశారు. రాహుల్ గాంధీ 'ఓటర్ అధికార్ యాత్ర' గ్రాండ్ సక్సెస్ అయిందనీ, అంటే దాని అర్థం ఇతర పార్టీలు కాంగ్రెస్‌కు తమ సీట్లు త్యాగం చేయాలని కాదని అన్నారు. కాగా, ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య ఉన్నత స్థాయిలో మరో సమావేశం జరగవచ్చని, రాబోయే రెండు వారాల్లో సీట్ల పంపకాల ఒప్పందంపై లాంఛన పూర్వకంగా ఒక ప్రకటన చేసే అవకాశాలున్నాయని ఆర్‌జేడీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
నాలుగు స్లాబ్‌లు బీజేపీ నిర్ణయం కాదు.. విపక్షాలపై నిర్మలా సీతారామన్ విసుర్లు
తిహాడ్ జైలును పరిశీలించిన యూకే అధికారులు.. నీరవ్ మోదీ, మాల్యాను అప్పగించే అవకాశం
For More National News And Telugu News