Jyoti Malhotra: జ్యోతీ మల్హోత్రా యూట్యూబర్ నుంచి పాకిస్థాన్ గూఢచారి వరకు

ABN , First Publish Date - 2025-05-19T13:17:52+05:30 IST

పర్యటనల పేరుతో అనేక ప్రాంతాలను పరిచయం చేసిన 'ట్రావెల్ విత్ జో' యూట్యూబర్ జ్యోతీ మల్హోత్రా (Jyoti Malhotra).. ఇప్పుడు జైలులో అధికారుల విచారణలో ఉన్నారు. పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేసిన ఆరోపణలతో ఆమె అరెస్ట్‌ కాగా, దీనికి ముందు ఆమె లైఫ్ స్టైల్ ఎలా ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Jyoti Malhotra: జ్యోతీ మల్హోత్రా యూట్యూబర్ నుంచి పాకిస్థాన్ గూఢచారి వరకు
Jyoti Malhotra

ఒకప్పుడు నోమాడిక్ లియో గర్ల్ అంటూ ఫేమస్ అయిన యూట్యూబ్ ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా (JyotiMalhotra).. ఇప్పుడు దేశద్రోహి కేసులో విచారణలో ఉన్నారు. ఆమె లైఫ్‌స్టైల్, లగ్జరీ ట్రావెల్స్, అంతర్జాతీయ పరిచయాల వెనుక దాగి ఉన్న చికటి కోణం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇది కేవలం ఒక యువతి అనుకోకుండా గూఢచారిగా మారిన కథ కాదు. ఇది సోషల్ మీడియా ప్రభావం, మనీ లేదా ఇతర ప్రలోభాలకు ఆశపడి గూఢచర్యానికి పాల్పడ్డ సంఘటన అని చెప్పుకోవచ్చు.


ఆమె యాత్ర

హర్యానాలోని 33 ఏళ్ల జ్యోతి మల్హోత్రా Travel With Jo పేరుతో యూట్యూబ్‌తో తన ప్రయాణ వీడియోలతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈ క్రమంలో ఆమె ఛానెల్‌కు 3.85 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆమె అనేక దేశాలను సందర్శించింది. వాటిలో చైనా, మలేషియా, తూర్పు యూరప్ దేశాలతో పాటు పాకిస్థాన్ కూడా ఉంది. ఆమె పాక్ ట్రిప్‌లతో చర్చనీయాంశంగా మారింది. పాక్ హైకమిషన్ నుంచి ఆమెకు పర్మిషన్ రావడం, ఖరీదైన హోటళ్లలో బస చేయడం, వీఐపీ పార్టీలకు హాజరుకావడం ఇవన్నీ అనుమానాలకు తావిచ్చాయి.


ఆధునిక స్పై

కరోనా తరువాత సోషల్ మీడియా వినియోగం భారీగా పెరిగిపోయింది. ఇదే సమయంలో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ నుంచి క్రియేటర్లు లక్షల్లో ఆదాయం సంపాదించే స్థాయికి చేరుకున్నారు. కానీ ఈ క్రియేటివ్ ప్రపంచంలో ఎవరు నమ్మదగినవారు, ఎవరు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారనేది మాత్రం అంత ఈజీగా చెప్పలేం. హిసార్ పోలీసు సూపరింటెండెంట్ శశాంక్ కుమార్ సావన్ ప్రకారం జ్యోతి మల్హోత్రా నేరుగా రక్షణ సమాచారం కలిగి లేకపోయినా, ఆమె పాక్ అధికారులతో సంబంధాలు కొనసాగించిందని అంటున్నారు. ఆమె ఇతర యూట్యూబర్లతోనూ పరిచయాలు పెంచుకుని తక్కువలో ఎక్కువ సమాచారం పంచుకునే ప్రయత్నం చేసిందని చెబుతున్నారు.


సంబంధాలు ఎలా మొదలయ్యాయి

పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకుల మృతితో భారత్ ఆపరేషన్ సిందూర్ (OperationSindoor) ప్రారంభించింది. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లో పోస్టింగ్‌లో ఉన్న డానిష్ అనే అధికారితో జ్యోతికి పరిచయం ఏర్పడింది. అతని సూచనలతో పాకిస్థాన్‌లోని అలీ అహ్వాన్ అనే వ్యక్తిని కలిసిన జ్యోతి, అక్కడ హై ప్రొఫైల్ పార్టీల్లో పాల్గొనడం, ఇతర నిఘా అధికారులను కలవడం జరిగిందని పోలీసులు తెలిపారు. "షకీర్" అనే నిఘా అధికారిని "జాట్ రంధావా" పేరుతో ఫోన్‌లో సేవ్ చేసుకున్న ఆమె, వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ ద్వారా టచ్‌లో ఉంది. ఇదే ఆధారంగా పోలీసులు ఆమెపై మరింత విచారణ చేస్తున్నారు.


లగ్జరీ లైఫ్‌స్టైల్

ఫస్ట్ క్లాస్ విమాన ప్రయాణాలు, హై ఎండ్ రెస్టారెంట్లు, ఖరీదైన గదులు ఇవన్నీ ఆమె రెగ్యులర్ జీవితంలో భాగంగా మారిపోయాయి. కానీ ఈ జీవనశైలి ఆమె ఆదాయానికి ఏమాత్రం సరిపోలడం లేదు. దాంతోపాటు ఆమె ప్రయాణ ఖర్చులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది కూడా దర్యాప్తు చేస్తున్నారు. పాకిస్థాన్ ట్రిప్ తర్వాత చైనా వెళ్లిన జ్యోతి, అక్కడ కూడా ఖరీదైన షాపింగ్, లగ్జరీ కార్ రైడ్లు చేసిన వీడియోలను పోస్ట్ చేసింది. ఈ మొత్తం వ్యవహారం ఆమెను భారత భద్రతా ఏజెన్సీల దృష్టిలో పడేలా చేశాయి.

ప్రస్తుతం విచారణలో

జ్యోతిని ప్రస్తుతం హర్యానా పోలీసులు ఐదు రోజుల పోలీస్ కస్టడీలో ఉంచారు. ఆమె ఫోన్లు, ల్యాప్‌టాప్, ఇతర గాడ్జెట్‌లు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. ఆర్థిక లావాదేవీల ఆధారంగా ఆమె వెనుక ఉన్న వ్యక్తుల గురించి కూడా దర్యాప్తు కొనసాగుతోంది.


ఇవీ చదవండి:

SBI: ఎఫ్‌డీ ఆశలకు బ్రేక్.. రెండోసారి కోత పెట్టిన ఎస్‌బీఐ


Heavy Rain: భారీ వర్షం, ఆఫీసులు బంద్.. జేసీబీలో ఎమ్మెల్యే పర్యటన..


భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - 2025-05-19T14:09:04+05:30 IST