Cyclone Ditwah: దిత్వా తుపాను బీభత్సం.. శ్రీలంకలో 56 మంది మృతి, మోదీ సంతాపం
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:00 PM
దిత్వా తుపాను కారణంగా శ్రీలంకలో భారీ ప్రాణనష్టం జరగడంపై ప్రధానమంత్రి మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలు త్వరత గతిన కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.
న్యూఢిల్లీ: శ్రీలంకలో దిత్వా తుపాను (Cyclone Ditwah) కారణంగా ఆకస్మిక వరదలు (Floods), కొండచరియలు విరిగిపడి 56 మంది మరణించగా, 21 మందికి పైగా జాడ గల్లంతైంది. దీంతో శ్రీలంక ప్రభుత్వం శుక్రవారంనాడు పబ్లిక్ హాలిడే ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను వేగంగా భారత్‌వైపు దూసుకు వస్తుండటంతో తమిళనాడు, పుదుచ్చేరి ఆంధ్రప్రదేశ్, కేరళలో అలర్ట్ ప్రకటించారు. ఈ రాష్ట్రాల్లోని కోస్తా తీర ప్రాంతాలను ఈనెల 30న తుపాను తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మోదీ సంతాపం
దిత్వా తుపాను కారణంగా వరదలతో శ్రీలంకలో భారీ ప్రాణనష్టం జరగడంపై ప్రధానమంత్రి మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలు త్వరత గతిన కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో శ్రీలంకను ఆదుకునేందుకు 'ఆపరేషన్ సాగర్ బంధు' కింద సహాయ సామగ్రిని పంపిస్తున్నట్టు తెలిపారు.
కాగా, తమిళనాడు, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, కేరళలో శుక్రవారంనాడు పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. మరోవైపు తమిళనాడులోని తూత్తుకుడిలో పలు ప్రాంతాలు కొద్దిరోజులుగా భారీ వర్షాలతో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దిత్వా తుపానును ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతతో ఉన్నట్టు చెప్పారు. డెల్టా జిల్లాలు, దక్షిణాది ప్రాంతాల్లో ఈనెల 29-30 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు చేసిందని, దీనిపై 14 జిల్లాల కలెక్టర్లతో తాను సమావేశమై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించానని చెప్పారు. సైక్లోన్ ప్రభావం ఉండే ప్రాంతాల్లో సహాయక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 16 ఎస్‌డీఆర్ఎఫ్ టీమ్‌లు, 12 ఎన్‌డీఆర్ఎఫ్ టీమ్‌లను ఆయా జిల్లాల్లో మోహరిస్తున్నట్టు చెప్పారు.
ఉడిపిలో లక్ష కంఠ గీతా పఠనం.. హాజరైన మోదీ
DK Shivakumar: ఏదీ కోరను, తొందరపడను... డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.