Karnataka politics: రసకందాయంలో కర్ణాటకం
ABN , Publish Date - Nov 28 , 2025 | 03:58 AM
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై రాజకీయం బాగా వేడెక్కింది. ఒకదాన్ని మించి ఒకటిగా నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి....
సిద్దరామయ్య, డీకే శివకుమార్ మాటల తూటాలు
బెంగళూరు, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై రాజకీయం బాగా వేడెక్కింది. ఒకదాన్ని మించి ఒకటిగా నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య కుర్చీపోరు తుది దశకు చేరుకుంది. తన సహనం నశిస్తోందంటూ డీకే సంకేతాలు ఇస్తుండగా, కుర్చీ దిగేదే లేదన్నట్టు సిద్దరామయ్య తేల్చిచెబుతున్నారు. వీరి పోరాటం తాజాగా సోషల్ మీడియాకు ఎక్కింది. ఇద్దరూ గురువారం ‘ఎక్స్’లో వాడీవేడీ పోస్టులు పెట్టారు. ‘ఇచ్చిన మాటమీద నిలబడటం ప్రపంచంలో గొప్ప విషయం, అది న్యాయమూర్తి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు లేదా నేను కావచ్చు’ అని డీకే శివకుమార్ పోస్టు చేయగా, దీనికి కౌంటర్‌గా సిద్దరామయ్య.. ‘మేము కర్ణాటకకు ఇచ్చిన మాట కేవలం నినాదం కాదు.. అదే మాకు సర్వస్వం’ అని ట్వీట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కన్నడ రాజకీయం ఢిల్లీకి మారింది. బెంగళూరు పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం ఉదయం హడావుడిగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. దీనికి ముందు ఆయన తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు నాకు తెలుసు. ఒకట్రెండు రోజుల్లోనే సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌ను ఢిల్లీకి పిలుస్తాం. సోనియా, రాహుల్‌తో సహా సీనియర్ నేతలతో సమావేశమై చర్చిస్తా’ అన్నారు.