EPS: కనిమొళికి ఈపీఎస్ కౌంటర్.. అరివాలయాన్ని కాపాడింది ‘అమ్మే’
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:28 PM
అన్నాడీఎంకే కార్యాలయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఢిల్లీకి మార్చారంటూ ఎద్దేవా చేసిన డీఎంకే లోక్‌సభ సభ్యురాలు కనిమొళికి ఆయన కౌంటర్ ఇచ్చారు.
చెన్నై: అన్నాడీఎంకే కార్యాలయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswami) ఢిల్లీకి మార్చారంటూ ఎద్దేవా చేసిన డీఎంకే లోక్‌సభ సభ్యురాలు కనిమొళికి ఆయన కౌంటర్ ఇచ్చారు. డీఎంకే ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయాన్ని కాపాడింది దివంగత ముఖ్యమంత్రి జయలలితేనన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. తమ పార్టీ కార్యాలయం రాయపేటలోనే వుందని, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో ఎప్పుడూ అన్నాడీఎంకే ముందుంటుందన్నారు. ఆ విధంగానే కరుణానిధి డీఎంకేలో ఉన్న సమయంలో అన్నా అరివాలయాన్ని కైవసం చేసుకునేందుకు కొంతమంది ప్రయత్నించినప్పుడు వారిని అడ్డుకుని ఆ కార్యాలయాన్ని కాపాడింది అమ్మే (జయలలిత)నన్న నిజాన్ని కనిమొళి మర్చిపోవద్దని సూచించారు.

అయితే తమ కూటమిలో ఉన్న పార్టీలకు సాయం చేసిన చరిత్ర డీఎంకేకు లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈపీఎస్ మంగళవారం నీలగిరి జిల్లా కున్నూర్, ఊటీ ప్రాంతాల్లో పర్యటించారు. కున్నూర్ బస్‌స్టేషన్ సమీపంలో రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆచరణకు సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం మరో 7 నెలలు మాత్రమే పెత్తనం చెలాయించనుందన్నారు. జీఎస్టీ తగ్గింపు సోమవారం నుంచే అమలులోకి వచ్చినా.. రాష్ట్రంలో మాత్రం వస్తువుల ధరలు తగ్గిన దాఖలా లేదని, దీనిపై రాష్ట్రప్రభుత్వం కూడా దృష్టిసారించలేదని ఆరోపించారు.

అన్నాడీఎంకే హయాంలో అన్ని జిల్లాలకు ప్రాధాన్యత కల్పించామని, అలాగే నీలగిరి జిల్లాలో నివసిస్తున్న గిరిజనులు అనారోగ్యానికి గురైతే చికిత్స కోసం కోయంబత్తూరు వెళ్లే అవసరం లేకుండా రూ.400 కోట్లతో ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిని ప్రారంభించి ఆధునిక విధానంలో శస్త్ర చికిత్స విధానాలను కూడా తీసుకొచ్చామన్నారు. కున్నూర్‌లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేలా మల్టీలెవల్ పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తామని ఈపీఎస్ హామీ ఇచ్చారు. మద్యం తయారీ పరిశ్రమలు నడుపుతున్న డీఎంకే నేతలను వదిలిపెట్టే పరిస్థితేలేదని ఈపీఎస్ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భగ్గుమన్న బంగారం.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
హుస్సేన్ సాగర్‌కు పోటెత్తిన వరద.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
Read Latest Telangana News and National News