DK Shivakumar: నచ్చిన వాచీలు పెట్టుకుంటాం.. శాంటోస్ డి కార్టియర్ వాచ్‌పై డీకే క్లారిటీ
ABN , Publish Date - Dec 05 , 2025 | 06:08 PM
తన వద్ద రూ.9 లక్షలు విలువచేసే రోలెక్స్, రూ.23.9 లక్షలు, రూ.12.06 లక్షలు విలువ చేసే రెండు కార్టియర్ వాచ్‌లు ఉన్నట్టు లోకాయుక్తకు తాను అఫిడవిట్ సమర్పించినట్టు డీకే శివకుమార్ తెలిపారు. ఆ డాక్యుమెంట్ కాపీని కూడా ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో షేర్ చేశారు.
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఒకే రకమైన ఖరీదైన వాచీలు ధరించడం చర్చనీయాంశమవుతోంది. డీకే ధరించిన శాంటోస్ డి కార్డియర్ వాచ్‌ను లెక్కల్లో చూపించలేదంటూ శాసనమండలిలో విపక్ష నేత చదలవాడి నారాయణ స్వామి ఇటీవల వ్యాఖ్యానించడం తాజా చర్చకు కారణమైంది. అయితే ఈ ఆరోపణలను డీకే శివకుమార్ (DK Shivakumar) శుక్రవారంనాడు ఖండించారు. తన ఆస్తులన్నీ పారదర్శకంగా ఉన్నాయని చెప్పారు. బాధ్యత కలిగిన నారాయణస్వామి వంటి వ్యక్తులు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం తగదని అన్నారు.
తన వద్ద రూ.9 లక్షలు విలువచేసే రోలెక్స్, రూ.23.9 లక్షలు, రూ.12.06 లక్షలు విలువ చేసే రెండు కార్టియర్ వాచ్‌లు ఉన్నట్టు లోకాయుక్తకు తాను అఫిడవిట్ సమర్పించానని డీకే తెలిపారు. ఆ డాక్యుమెంట్ కాపీని కూడా ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో షేర్ చేశారు.
'మిస్టర్ నారాయణ స్వామి... ఇదిగో నేను లోకాయుక్తకు సమర్పించిన అఫిడవిట్. మీలాంటి బాధ్యతల కలిగిన వ్యక్తి ముందువెనుకలు చూసుకోకుండా మాట్లాడటం తగదు. ఇందువల్ల మీకు పెరిగే గౌరవం ఏమీ ఉండదు. నేను పారదర్శకంగా ఉండే వ్యక్తిని. నిజమే చెబుతాను, ఏదీ దాటిపెట్టే ప్రసక్తే లేదు' అని డీకే పేర్కొన్నారు. నచ్చిన వాచ్‌లు ధరించే హక్కు తనకు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఉందని స్పష్టం చేశారు.
దీనికి ముందు నారాయణ స్వామి మాట్లాడుతూ, సీఎం, డీప్యూటీ సీఎం ఒకరకమైన వాచ్‌లు ధరించడం బాగానే ఉందని, అయితే ఆయన (డీకే) అబద్ధం చెప్పడం ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ అఫిడవిట్‌లో రోలెక్స్ వాచ్ (రూ.9 లక్షలు), హబ్లాట్ వాచ్ (రూ.23.9 లక్షలు) ఉన్నట్టు ఆయన పేర్కొన్నారని, కానీ సిద్ధరామయ్య, శివకుమార్‌లు కార్టియర్ వాచ్‌లు ధరించారని అన్నారు. 'మీరెక్కడ కార్టియర్ గురించి డిక్లేర్ చేశారు? అది దొంగిలించిన ఆస్తా, కొన్న ఆస్తా' అని ప్రశ్నించారు. కాగా, గతంలో సిద్ధరామయ్య మొదటిసారి సీఎంగా ఉన్నసమయంలో 'హబ్లాట్ వాచ్' వివాదం తలెత్తడంతో దాన్ని స్టేట్ ప్రాపర్టీగా పేర్కొంటూ అసెంబ్లీ సెక్రటేరియట్‌కు ఆయన అందజేశారు.
ఇవి కూడా చదవండి..
ఇండిగో సంక్షోభంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు కేంద్రం నిర్ణయం
శాంతిపక్షానే భారత్.. పుతిన్‌కు మోదీ స్పష్టీకరణ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి