Share News

JammuKashmir Cloud Burst: జమ్మూకశ్మీర్‌లో మరో క్లౌడ్‌ బరస్ట్.. పలువురు మృతి

ABN , Publish Date - Aug 30 , 2025 | 09:33 AM

గత కొన్ని రోజులుగా జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ఫలితంగా కేంద్రపాలిత ప్రాంతంలో అనేక క్లౌడ్‌ బరస్టులు, ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. నిన్న(శుక్రవారం) కూడా బండిపోరా జిల్లాలోని గురేజ్ సెక్టార్‌లో మరో క్లౌడ్‌ బరస్ట్‌ జరగినట్లు అధికారులు తెలిపారు.

JammuKashmir Cloud Burst: జమ్మూకశ్మీర్‌లో మరో క్లౌడ్‌ బరస్ట్.. పలువురు మృతి

జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఉత్తరాన కశ్మీర్‌ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు.. పశ్చిమాన రాణ్‌ ఆఫ్‌ కచ్‌ నుంచి తూర్పున దీపూపాస్‌ వరకు అంతటా భారీ వర్షాలు, వరదల బీభత్సం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాంబాన్‌ జిల్లాలో మరో క్లౌడ్‌ బరస్ట్‌ సంభవించింది. ఈ విపత్తులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో మరణించిన ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మృతిచెందిన వారిలో ఇద్దరు మహిళలను గుర్తించినట్లు పేర్కొన్నారు.


గత కొన్ని రోజులుగా జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ఫలితంగా కేంద్రపాలిత ప్రాంతంలో అనేక క్లౌడ్‌ బరస్టులు, ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. నిన్న(శుక్రవారం) కూడా బండిపోరా జిల్లాలోని గురేజ్ సెక్టార్‌లో మరో క్లౌడ్‌ బరస్ట్‌ జరగినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా పరిస్థితి మరింత దిగజారుతుందని ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు 2014లో కశ్మీర్‌లో వరదలు వచ్చిన తర్వాత ప్రకటించిన రూ.80,000 కోట్ల ప్యాకేజీని జమ్మూ ప్రాంతానికి రెట్టింపు మంజూరు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్లు తెలిపారు.


జమ్మూ దాదాపు 100 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత దారుణమైన ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కొంటోందని డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి తెలిపారు. జమ్మూలోని బాధిత ప్రజలకు ప్యాకేజీని నేరుగా అందించాలని ఆయన అన్నారు. నష్టం చాలా అపారమైనదని, ఈ రోజు తాను ప్రధానమంత్రి, దేశ హోంమంత్రిని ఒక పెద్ద ప్యాకేజీని ప్రకటించమని విజ్ఞప్తి చేసినట్లు చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఈసారి జమ్మూ 2014లో కాశ్మీర్ కంటే పెద్ద వరదలను చూసిందని వివరించారు. దీనివల్ల భారీ విధ్వంసం సంభవించిందన్నారు. అందుకోసం రూ. 80,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్యాకేజీ అవసరమని ఆయన భావిస్తున్నట్లు చెప్పారు.


ఇదిలా ఉండగా.. భారత వాతావరణ శాఖ(IMD) ఇవాళ(శనివారం) రాజౌరి, రియాసి, జమ్మూ, ఉధంపూర్, కథువా, సాంబా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్జ్ జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. రాంబన్, కిష్త్వార్, దోడా జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు, కొన్ని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని  ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇన్‌ఫార్మర్‌ నెపంతో గిరిజనుడి హత్య

గణేశుడి మండపం వద్ద కరెంట్‌ షాక్‌తో బాలుడి మృతి

Updated Date - Aug 30 , 2025 | 09:44 AM