Maoists: ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:56 AM
పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడన్న నెపంతో మావోయిస్టులు ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్ జిల్లా మంకేలి గ్రామానికి చెందిన గిరిజనుడు కొర్సా సురేశ్(27)ను దారుణంగా హత్య చేశారు.
బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల చర్య
నారాయణపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు హతం
చర్ల, అగస్టు 29 (ఆంధ్రజ్యోతి): పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడన్న నెపంతో మావోయిస్టులు ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్ జిల్లా మంకేలి గ్రామానికి చెందిన గిరిజనుడు కొర్సా సురేశ్(27)ను దారుణంగా హత్య చేశారు. సురేశ్ గ్రామంలో కిరాణా షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం సురేశ్ ఇంటికి వెళ్లిన మావోయిస్టులు అతన్ని దారుణంగా కొట్టి, కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ మేరకు అతని కుటుంబసభ్యులు వివరాలను వెల్లడించారు. గడిచిన రెండు రోజుల్లో బీజాపూర్, సుకుమా జిల్లాల్లో ఇద్దరిని మావోయిస్టులు హత్య చేయడం కలకలం రేపుతోంది.
మరోవైపు, నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్ అడవుల్లో మావోయిస్టులున్నట్టు సమాచారం రావడంతో కేంద్ర బలగాలు శుక్రవారం కూబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మాడ్ ఏరియాలో మావోయిస్టులు, కేంద్ర బలగాల మధ్య కాల్పులు జరిగాయని, ఒక మావోయిస్టు చనిపోయాడని ఎస్పీ రాబిన్‌సన్ తెలిపారు. ఘటనా స్థలంలో తుపాకులు, బుల్లెట్లు, బీజీఎల్స్ లాంచర్లు, వైర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.