Delhi Crime: పెళ్లికి నిరాకరించిందని 25 ఏళ్ల మహిళపై దారుణం..
ABN , Publish Date - Dec 26 , 2025 | 09:10 AM
ఢిల్లీలో నివాసం ఉంటున్న 25 ఏళ్ల కల్పన అనే మహిళపై కాల్పులు జరిగాయి. పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ వ్యక్తి ఆమెపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆమె..
ఢిల్లీ, డిసెంబర్ 26: నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయి. లైంగిక వేధింపుల కారణంగా చాలా మంది.. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతుంటారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా.. కొందరు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా పెళ్లైన 25 ఏళ్ల మహిళ.. తనతో వివాహానికి నిరాకరించిందని ఓ వ్యక్తి కాల్పులకు తెగపడ్డాడు. ఈ ఘటన డిసెంబర్ 20న ఢిల్లీ(Delhi Crime)లో జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి భర్త పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం..
ఢిల్లీలోని నజాఫ్‌గఢ్‌కు చెందిన కల్పన అనే 25 ఏళ్ల మహిళ.. తన భర్తతో కలిసి నివాసం ఉంటుంది. ఆమె గురుగ్రామ్‌లోని ఒక క్లబ్‌లో పనిచేస్తుంది. రోజూలాగానే డిసెంబర్ 19న క్లబ్ లో పనికి వెళ్లింది. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటి గంట సమయంలో భర్తకు ఫోన్ చేసిన కల్పన.. తనపై కాల్పులు జరిగాయని తెలిపారు. ఢిల్లీలోని సంగం విహార్ నివాసి అయిన తుషార్ ఆమెపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు క్లబ్ వద్దకు చేరుకున్నారు. కాల్పుల ఘటనలో గాయపడిన ఆమెను స్థానికులు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. అక్కడ ఆమె వాంగ్మూలం ఇచ్చే స్థితిలో లేదని పోలీసులు చెప్పారు. సుమారు నెల రోజుల క్రితం తుషార్ తమ ఇంటికి వచ్చి.. గొడవపడి వెళ్లిపోయాడని కల్పన భర్త పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఫిర్యాదు ఆధారంగా సెక్టార్ 29 పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా, ఢిల్లీ క్రైమ్ యూనిట్ బృందం ఇద్దరు నిందితులు తుషార్ అలియాస్ జంటీ (25), అతని స్నేహితుడు శుభమ్ అలియాస్ జానీ (24)లను అరెస్టు చేశారు. తుషార్ సుమారు ఆరు నెలల క్రితం బాధితురాలితో స్నేహం చేశాడని, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని, కానీ ఆమె పదేపదే నిరాకరించిందని నిందితుడు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. డిసెంబర్ 19వ తేదీ రాత్రి తుషార్ క్లబ్(Delhi crime news)కు వెళ్లి, ఆమెకు మరోసారి ప్రపోజ్ చేశాడని, ఆమె నిరాకరించడంతో ఆ మహిళపై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
సోషల్ మీడియా యాప్స్ వినియోగంపై సిబ్బందికి ఆర్మీ మార్గదర్శకాలు
షేక్ హసీనా స్థానం నుంచి హిందూ నేత పోటీ!