PM Modi: కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ ఒక్క కుటుంబాన్ని మాత్రమే కీర్తించాయి
ABN , Publish Date - Dec 26 , 2025 | 04:29 AM
స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ ఒక్క(నెహ్రూ) కుటుంబాన్ని మాత్రమే కీర్తిస్తూ మిగతా జాతీయ నాయకులను విస్మరించాయని ప్రధాని మోదీ విమర్శించారు
ఒక్క కుటుంబానికే ఘనతలన్నీ ఆపాదించాయి
ప్రధాని మోదీ విమర్శలు
లక్నో, డిసెంబరు 25: స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ ఒక్క(నెహ్రూ) కుటుంబాన్ని మాత్రమే కీర్తిస్తూ మిగతా జాతీయ నాయకులను విస్మరించాయని ప్రధాని మోదీ విమర్శించారు. ఘనతలన్నీ ఒక్క కుటుంబానికే ఆపాదించారనే విషయం ఎవరూ మరచిపోవద్దని ఆయన నెహ్రూ కుటుంబాన్ని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని రాష్ట్ర ప్రేరణా స్థల్‌లో మాజీ ప్రధాని వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా 65 అడుగుల కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. ఇదే చోట శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాలను కూడా ప్రధాని ఆవిష్కరించారు. 98 వేల అడుగుల విస్తీర్ణంలో కమలం ఆకారంలో నిర్మించిన మ్యూజియాన్ని కూడా ప్రారంభించారు. వాజ్‌పేయి ప్రాతినిధ్యం వహించిన ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం రక్షణ ఉత్పత్తుల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచబోతుందన్నారు. గత ఎన్డీయే ప్రభుత్వాల సుపరిపాలనను మరింత ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.