Share News

K4 Missile test: ఖండాంతర కె-4 క్షిపణి ప్రయోగం సక్సెస్‌

ABN , Publish Date - Dec 26 , 2025 | 04:26 AM

వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మనదేశం కీలక క్షిపణి పరీక్షను నిర్వహించింది. అణు సామర్థ్య జలాంతర్గామి నుంచి బంగాళాఖాతంలో.....

K4 Missile test: ఖండాంతర కె-4 క్షిపణి ప్రయోగం సక్సెస్‌

  • సముద్ర గర్భం నుంచి 3,500 కి.మీ. పరిధిలో లక్ష్యాలు ఛేదించే సామర్థ్యం

  • ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ నుంచి ప్రయోగం

  • 2.5 టన్నుల వార్‌హెడ్‌ మోసుకెళ్లే క్షిపణి

  • ‘అణు త్రయం’లో మరో ముందడుగు

న్యూఢిల్లీ, డిసెంబరు 25: వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మనదేశం కీలక క్షిపణి పరీక్షను నిర్వహించింది. అణు సామర్థ్య జలాంతర్గామి నుంచి బంగాళాఖాతంలో మధ్యస్థ స్థాయి ఖండాంతర క్షిపణిని పరీక్షించి మన అణు శక్తిని ప్రపంచానికి చాటింది. మంగళవారం విశాఖపట్నం తీరంలో ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ జలాంతర్గామి నుంచి కె-4 క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. 3,500 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించడానికి రూపొందించిన ఈ క్షిపణితో భారత్‌ సముద్ర ఆధార అణు శక్తికి మరింత బలం చేకూరనుంది. కె-4 జలాంతర్గామి నుంచి ప్రయోగించే ఖంతాంతర క్షిపణి (ఎస్‌ఎల్‌బీఎం)తో భూ ఉపరితలం, గగనతలం, సముద్రగర్భం నుంచి అణు దాడుల సామర్థ్యం ఉన్న దేశాల సరసన భారత్‌ చేరింది. మూడు రకాలుగా రహస్య దాడులు చేసే మన దేశ అణ్వాయుధ త్రయంలో కె-4 క్షిపణులు కీలక పాత్ర పోషిస్తాయి. అణు దాడుల నిరోధక గస్తీ కోసం సముద్రంలో రహస్యంగా, నిశ్శబ్దంగా సుదీర్ఘకాలం పాటు సంచరించే అరిహంత్‌ తరగతి జలాంతర్గాముల కోసం వీటిని రూపొందించారు. భూ ఉపరితం నుంచి దాడులు చేసే అగ్ని-3 క్షిపణి నుంచి దేశంలోనే అత్యధిక దూరంలోని లక్ష్యాలను ఛేదించే సముద్ర ఆధార కె-4 క్షిపణిని అభివృద్ధి చేశారు. ఈ క్షిపణి 2.5 టన్నుల అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు.


కె-4 అంటే ఇది..

మధ్యస్థ స్థాయి, ఘన ఇంధన జలాంతర్గామి నుంచి ప్రయోగించే ఖండాంతర క్షిపణి కె-4. ఈ క్షిపణుల సిరీ్‌సలో ‘కె’ అనే అక్షరాన్ని ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ స్మృత్యర్థం పెట్టారు. దీనిని డీఆర్‌డీవో అభివృద్ధి చేయగా, క్షిపణులను భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) తయారు చేస్తోంది. ఈ క్షిపణిని అరిహంత్‌ తరగతి ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌, ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ వంటి జలాంతర్గాముల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. ఈ క్షిపణితో సముద్రంలో మన యుద్ధ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. అంతకుముందు 700 కి.మీ పరిధి మాత్రమేగల కె-15 (సాగరిక)పైనే ఆధార పడేవారు. 10 నుంచి 12 మీటర్లు పొడవుండే కె-4 క్షిపణి 17 నుంచి 20 టన్నుల వరకు బరువు ఉంటుంది. రెండు దశల స్థిర రాకెట్‌ మోటార్‌తో పనిచేస్తుంది. ఈ క్షిపణి నావిగేషన్‌ కోసం జీఎన్‌ఎ్‌సఎ్‌సతో పాటు నావిక్‌పై ఆధారపడుతుంది.

వ్యూహాత్మకంగా చాలా కీలకం

తాజా కె-4 పరీక్ష మన దేశానికి వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది. త్వరలోనే జలాంతర్గాముల అమ్ములపొదిలో చేరే ఈ క్షిపణితో అణుదాడుల నిరోధక సామర్థ్యం మరింత పెరుగుతుంది. తొలిగా అణుదాడుల చేయబోమన్న దానికి కట్టుబడి, శత్రుదేశాలు చేసే దాడులను సమర్థంగా తిప్పికొట్టగలిగే రెండో దాడికి ఈ క్షిపణులు ఎంతో ఉపయోగపడతాయి. దీని సుదీర్ఘ రేంజ్‌తో హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మక స్థిరత్వం, దాడుల నిరోధ శక్తి పెరుగుతుంది. హిందూ మహాసముద్రంలో చైనా తన శక్తిని పెంచుకోవడం, ఫసిఫిక్‌ జలాల్లో అమెరికా ప్రభావం నేపథ్యంలో కె-4 వంటి క్షిపణులు శత్రు దాడులను తిప్పికొట్టడమే కాకుండా, ప్రాంతీయ భయాలు పెరగకుండా అదుపులో ఉంచగలుగుతాయని రక్షణ సిబ్బంది చెప్పారు.

Updated Date - Dec 26 , 2025 | 04:26 AM