Share News

Rekha Gupta: పంజాబ్‌పై దృష్టి పెట్టండి, నా రీల్స్‌పై కాదు.. కేజ్రీవాల్‌కు సీఎం చురక

ABN , Publish Date - Sep 22 , 2025 | 05:53 PM

కేజ్రీవాల్ పోస్ట్‌ను బీజేపీ వెంటనే తప్పుపట్టింది. ఎడిట్ చేసిన వీడియోతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమంటూ మండిపడింది. రేఖా గుప్తా ఇంటర్వ్యూ పూర్తి వీడియోను కూడా విడుదల చేసింది.

Rekha Gupta: పంజాబ్‌పై దృష్టి పెట్టండి, నా రీల్స్‌పై కాదు.. కేజ్రీవాల్‌కు సీఎం చురక
Rekha Gupta and Arvind Kejriwal

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)పై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta) వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. పంజాబ్‌లో పాలన, ప్రజలపై దృష్టి పెట్టకుండా తన రీల్స్‌పైనే ఆయన ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తోందని అన్నారు. సోమవారం నాడు మల్టీ లెవెల్ ఎలక్ట్రిక్ బస్సు డిపో‌ శంకుస్థాపనకు వచ్చిన సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.


అసలు ఏం జరిగిందంటే..

రేఖా గుప్తా మాట్లాడినట్టు ఉన్న 14 సెకెండ్ల ఒక వీడియోను అరవింద్ కేజ్రీవాల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్‌'లో షేర్ చేశారు. 'కాంగ్రెస్ 70 ఏళ్లుగా ఈవీఎం అవకతవకలకు పాల్పడినప్పుడు అంతా బాగానే ఉంది. ఇప్పుడు మేము చేస్తే మాత్రం వారు బాధపడుతున్నారు' అని రేఖా గుప్తా అన్నట్టుగా ఆ వీడియోలో ఉంది. 'సీఎం ఏం మాట్లాడుతున్నారు?' అంటూ కేజ్రీవాల్ తన పోస్ట్‌లో ప్రశ్నించారు.


కేజ్రీవాల్ పోస్ట్‌ను బీజేపీ వెంటనే తప్పుపట్టింది. ఎడిట్ చేసిన వీడియోతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమంటూ మండిపడింది. రేఖా గుప్తా ఇంటర్వ్యూ పూర్తి వీడియోను కూడా విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్‌పై సీఎం రేఖా విమర్శలు గుప్పిస్తూ, ప్రజలను రాహుల్ గాంధీ తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. 'వాళ్లు గెలిస్తే అది ప్రజాతీర్పు అంటారు. మేము గెలిస్తే ఈవీఎంలు హ్యాక్ చేసినట్టు ఆరోపిస్తారు. ఇదెక్కడి ఫార్ములా?' అని నిలదీశారు.


నా వీడియోలు చూడటం తగ్గించండి సారూ..

తాజాగా ఈ అంశంపై రేఖా గుప్తా స్పందించారు. 'కేజ్రీవాల్ సార్.. దయచేసి నా వీడియోలు, ఇంటర్వ్యూలు, రీల్స్ చూడటం తగ్గించండి. మేడం ఏమి చెప్పిందో, ఏమి చెప్పలేదో తెలుసుకునేందుకు రోజంతా నా వీడియోలు చూస్తున్నట్టు కనిపిస్తోంది' అని వ్యంగ్యోక్తులు గుప్పించారు. కేజ్రీవాల్ దృష్టి సారించాలనుకుంటే వరదలతో అతలాకుతులమైన పంజాబ్ ప్రజలపై దృష్టి సారించాలన్నారు. పంజాబ్ బాధితులను ఆయన కలిసినట్టు కూడా కనిపించడం లేదని చురకలు వేశారు. కాగా, పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉంది.


ఇవి కూడా చదవండి..

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో కలకలం

పైలట్ల తప్పిదం ఉందనడం బాధ్యతారాహిత్యం.. ఎయిరిండియా ప్రమాదంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 22 , 2025 | 08:03 PM