Air India Express Flight: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో కలకలం
ABN , Publish Date - Sep 22 , 2025 | 04:44 PM
ఎయిర్‌లైన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ IX-1086 విమానం ఉదయం 8 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరింది. గాలిలో ఉండగా ఒక ప్రయాణికుడు కాక్‌పిట్ డోర్ వద్దకు వచ్చి దానిని తెరిచేందుకు ప్రయత్నించాడు.
బెంగళూరు: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం (Air India Express Flight)లో సోమవారం నాడు కలకలం రేగింది. విమానం గాలిలో ఉండగా ఒక ప్రయాణికుడు కాక్‌పిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. బెంగళూరు నుంచి వారణాసికి విమానం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణించడం అతనికి ఇదే మొదటిసారని గుర్తించినట్టు ఎయిర్‌లైన్స్ వర్గాలు తెలిపాయి. అతని చర్య వెనుక ఏదైనా దురుద్దేశం ఉందా? అనేది ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించలేదు.
ఎయిర్‌లైన్స్ వర్గాల సమాచారం ప్రకారం, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ IX-1086 విమానం ఉదయం 8 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరింది. గాలిలో ఉండగా ఒక ప్రయాణికుడు కాక్‌పిట్ డోర్ వద్దకు వచ్చి దానిని తెరిచేందుకు ప్రయత్నించాడు. భద్రతాపరంగా కాక్‌పిట్ డోర్ తెరవాలంటే పాస్‌కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కూడా కెప్టెన్ అనుమతిస్తేనే అందులోకి ప్రవేశించడం సాధ్యమవుతుంది. ప్రయాణికుడు డోర్ తెరవడంలో విఫలం కాగా.. సిబ్బంది అతన్ని తిరిగి సీటు వద్దకు పంపారు. ప్రయాణికుడు కాక్‌పిట్ డోర్ తెరిచినట్టు వస్తున్న వార్తలను ఎయిర్‌లైన్స్ వర్గాలు తోసిపుచ్చాయి.
కాగా, విమానంలో కలకలం సృష్టించిన వ్యక్తి మరో ఏడుగురితో కలిసి ప్రయాణిస్తున్నాడు. వారణాసిలో విమానం దిగిన తర్వాత ఆ వ్యక్తిని సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించారు సిబ్బంది. అతని లగేజ్‌తోపాటు అతనితో ప్రయాణిస్తున్న వ్యక్తుల లగేజీనీ సిబ్బంది తనిఖీ చేశారు. భద్రతా ప్రమాణాల విషయంలో రాజీపడేది లేదని, ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
మూడు విడతల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు
పైలట్ల తప్పిదం ఉందనడం బాధ్యతారాహిత్యం.. ఎయిరిండియా ప్రమాదంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి