Share News

Indigo Crisis Special Trains: ట్రావెల్ కష్టాలకు ప్రత్యామ్నాయంగా సోమవారం ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Dec 07 , 2025 | 08:10 PM

సోమవారంనాడు రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని, ఒక రైలు డిబ్రూగఢ్ నుంచి న్యూఢిల్లీ వరకూ, మరో రైలు గౌహతి నుంచి హౌరా వరకూ వెళ్తుందని ఎన్ఎఫ్ఆర్ సీపీఆర్ఓ కపింజల్ కిషోర్ శర్మ తెలిపారు.

Indigo Crisis Special Trains: ట్రావెల్ కష్టాలకు ప్రత్యామ్నాయంగా సోమవారం ప్రత్యేక రైళ్లు
Special trains

న్యూఢిల్లీ: ఇండిగో సంక్షోభం (IndiGo Crisis) ఆరో రోజైన ఆదివారంనాడు కూడా కొనసాగుతుండటం, 650 విమానాలు రద్దుకావడంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు పలు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. బాధిత ప్రయాణికులకు ఆదుకునేందుకు ఇండియన్ రైల్వే రంగంలోకి దిగింది. అత్యవసర చర్యలు చేపట్టింది. అత్యధికంగా డిమాండ్ ఉన్న రూట్లలో ప్రత్యేక రైళ్లను నడపనుంది. ప్రత్యేక రైళ్లు సాధ్యంకాని రూట్లలో ప్రస్తుతం ఉన్న రైళ్లకు అదనపు కోచ్‌లను చేర్చనుంది. ఇందులో భాగంగా సోమవారంనాడు పలు రూట్లలో ప్రత్యేక రైళ్ల సేవలను అందిస్తున్నట్టు ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) ప్రకటించింది.


డిబ్రూగఢ్-న్యూఢిల్లీ ప్రత్యేక రైలు

వివిధ రూట్లలో పలు క్లాసులకు అదనపు బోగీలను చేరుస్తున్నట్టు ఎన్ఎఫ్ఆర్ సీపీఆర్ఓ కపింజల్ కిషోర్ శర్మ తెలిపారు. ఇండిగో విమానాల రద్దు దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. సోమవారంనాడు రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని, ఒక రైలు డిబ్రూగఢ్ నుంచి న్యూఢిల్లీ వరకూ, మరో రైలు గౌహతి నుంచి హౌరా వరకూ వెళ్తుందని చెప్పారు. దీనికి అదనంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు 18 వేర్వేరు రైళ్లను నడుపుతున్నామని చెప్పారు. వివిధ సెక్టార్లలో ఈ రైళ్లు నడుస్తాయని అన్నారు. ఈ ప్రత్యేక రైళ్ల గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని రైల్వే స్టేషన్లను కానీ ఇండియన్ రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కు కానీ ఫోన్ చేయవచ్చు. ఏ ట్రైన్‌కు అదనపు బోగీలను చేర్చారనే సమాచారం కూడా తెలుసుకోవచ్చు.


89 ప్రత్యేక రైళ్లు

కాగా, రాబోయే మూడు రోజుల్లో అన్ని జోన్లలో 89 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు భారతీయ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పాట్నా, హౌరా తదితర ప్రధాన నగరాల్లోని రైళ్ల రద్దీ పరిస్థితిని విశ్లేషించిన రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సత్వర చర్యలు తీసుకుంది. సెంట్రల్ రైల్వే 14, నార్తర్న్ రైల్వే 10 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ప్లాన్ చేసింది. పరిస్థితులను సమీక్షించి అవసరమైతే మరిన్ని రైళ్లను కూడా నడపనుంది. ఇతర జోన్‌లు కూడా తమ షెడ్యూల్‌తో పాటు ప్రత్యేక రైళ్లకు సంబంధించి నోటిఫికేషన్లు జారీచేశాయి.


ప్రయాణికులకు ఇండిగో రూ.610 కోట్లు రీఫండ్.. పౌర విమానయాన శాఖ వెల్లడి
గోవా అగ్నిప్రమాదంపై పోలీస్ యాక్షన్.. యజమానులపై ఎఫ్ఐఆర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 07 , 2025 | 09:02 PM