Share News

Rajnath Singh: బీఆర్ఓ నిర్మించిన 125 ప్రాజెక్టులు జాతికి అంకితం

ABN , Publish Date - Dec 07 , 2025 | 06:48 PM

వ్యూహాత్మక ప్రాధాన్యత కల్గిన ఈ ప్రాజెక్టులను రూ.5,000 కోట్ల వ్యయంతో లద్దాఖ్, జమ్మూకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, మిజోరాంలలో నిర్మించారు.

Rajnath Singh: బీఆర్ఓ నిర్మించిన 125 ప్రాజెక్టులు జాతికి అంకితం
Rajnath Singh

లెహ్: దేశవ్యాప్తంగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నిర్మించిన 125 ప్రాజెక్టులను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) ఆదివారంనాడు లెహ్ నుంచి జాతికి అంకితం చేశారు. దేశ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఈ ప్రాజెక్టులే నిదర్శనమని అన్నారు.


వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాజెక్టులను రూ.5,000 కోట్ల వ్యయంతో లద్దాఖ్, జమ్మూకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, మిజోరాంలలో నిర్మించారు. ఇందులో భాగంగా 28 రహదారులు, 93 వంతెనలు, మరో నాలుగు ఇతర ప్రాజెక్టులను బీఆర్ఓ నిర్మించింది. బీఆర్ఓ చరిత్రలో ఒకేరోజు ఇన్ని ప్రాజెక్టులు ప్రారంభం కావడం ఇదే ప్రథమం.


ఈ సందర్భంగా లెహ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఆత్మనిర్భర్ భారత్‌కు అనుగుణంగా నూతన సాంకేతికతతో సకాలంలో ప్రాజెక్టులను బీఆర్ఓ పూర్తిచేయడం అభినందనీయమని అన్నారు. మన సైనికులు సమర్థవంతంగా పనిచేసేందుకు రోడ్ నెట్‌వర్క్, రియల్ టైమ్ కమ్యూనికేషన్, ఉపగ్రహ ఆధారిత నిఘా వంటి సౌకర్యాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. మన సైనికుల శౌర్యం, ధైర్యం మనందరికీ స్ఫూర్తిదాయకమని, దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు ఈ ప్రాజెక్టులు అంకితమని పేర్కొన్నారు. సరిహద్దు రోడ్లు జాతీయ భద్రతకు లైఫ్‌లైన్లని అభివర్ణించారు. సాయుధ బలగాలు, బీఆర్ఓ సిబ్బంది, సరిహద్దు ప్రాంతాల్లోని పౌరులు కలిసి జాతీయ భద్రతకు రక్షణకవచాలుగా ఉన్నారని ప్రశంసించారు. ఈ అనుబంధం ఇలాగే కొనసాగుతుండాలని విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి..

గోవా అగ్నిప్రమాదంపై పోలీస్ యాక్షన్.. యజమానులపై ఎఫ్ఐఆర్

గోవా నైట్ క్లబ్ ప్రమాదం.. వెలుగులోకి భయానక వీడియో..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 07 , 2025 | 06:56 PM