Amit Shah: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తీర్పుతో నక్సల్స్‌కు.. 20 ఏళ్లు ఊపిరి!
ABN , Publish Date - Aug 26 , 2025 | 01:55 AM
ఇండీ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇచ్చిన ఒక తీర్పు కారణంగా కొన ఊపిరితో ఉన్న నక్సలైట్ ఉద్యమం మరో రెండు దశాబ్దాల పాటు దేశంలో మనగలిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు.
తర్వాత జరిగిన హింసకు రాహుల్ జవాబివ్వాలి
పదవీచ్యుతి బిల్లుపై విపక్షాల వైఖరి ఘోరం
రాహుల్ నైతిక ప్రమాణాలు ఎటు పోయాయి
నాడు ఆర్డినెన్స్ చించి నేడు లాలూకు మద్దతా?
మోదీ పట్టుబట్టి ప్రధానినీ బిల్లులో చేర్చారు
సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు పెట్టగానే గుజరాత్ హోం మంత్రి పదవిని త్యజించా
నా బెయిలు దరఖాస్తు పరిష్కారానికి రెండేళ్లు పట్టింది.. అప్పటిదాకా రాష్ట్రం వెలుపలే ఉన్నా
కేసు కొట్టేసే వరకు ఏ పదవీ తీసుకోలేదు
చివరికి కోర్టే దురుద్దేశ పూరిత కేసుగా తేల్చింది
ఏఎన్‌ఐ ఇంటర్వ్యూలో అమిత్‌షా
న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఇండీ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇచ్చిన ఒక తీర్పు కారణంగా కొన ఊపిరితో ఉన్న నక్సలైట్ ఉద్యమం మరో రెండు దశాబ్దాల పాటు దేశంలో మనగలిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. సల్వాజుడుం వ్యవస్థను రాజ్యాంగ విరుద్ధమని, రద్దు చేయాలని ఆదేశించడం ద్వారా సుదర్శన్‌రెడ్డి గిరిజనులకు ఉన్న స్వీయరక్షణ హక్కును కాలరాశారని మండిపడ్డారు. గిరిజనులు తమను తాము కాపాడుకొనేందుకే సల్వాజుడుం ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలను నక్సల్స్ కూల్చేస్తుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలను మోహరించాయని, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఒక్క కలంపోటుతో వాళ్లను రోడ్డున పడేశారని చెప్పారు. ఆ తర్వాత భద్రతా దళాల మీద నక్సల్స్ పెద్దఎత్తున దాడులు చేశారన్నారు. ఈ తీర్పునకు సంబంధించి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి కన్నా రాహుల్‌గాంధీ ఎక్కువ సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు. ఇండీ కూటమి సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేయడంలో వామపక్ష భావజాలమే ప్రాతిపదికగా తీసుకున్నారని అమిత్‌షా ఆరోపించారు. సోమవారం ఆయన ఏఎన్‌ఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. వామపక్ష సిద్ధాంత సానుభూతిపరుడైన సుదర్శన్‌రెడ్డిని ఎందుకు ఎంపిక చేశారో రాహుల్‌గాంధీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జైల్లోంచి దేశాన్ని నడిపిస్తామంటే ఎలా?
క్రిమినల్ కేసుల్లో జైలుపాలైన మంత్రులను పదవుల నుంచి తొలగించే మూడు బిల్లుల విషయంలో విపక్షాల వైఖరిపై అమిత్‌షా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జైలు పాలైన నేత ప్రమేయం లేకుండా ప్రభుత్వ పాలన నడవదన్న విపక్షాల ఆలోచనను బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని ప్రకటించారు. ‘‘పీఎం, సీఎం లేదా మరో నేత జైలు నుంచి దేశాన్ని నడిపిస్తానంటే ఎలా’’ అని ప్రశ్నించారు. ఈ మూడు బిల్లులను నెగ్గించుకొనే సంఖ్యాబలం ఉందో లేదో సభలోనే తేలుతుందన్నారు. మోదీ స్వయంగా తన పదవిని కూడా రాజ్యాంగ సవరణలో చేర్చాలని పట్టుబట్టి చేర్పించుకున్నారని చెప్పారు. 1975లో ఇందిర 39వ రాజ్యాంగ సవరణ ద్వారా తనను రక్షించుకోవడం కోసం ప్రధాని ఎన్నికను న్యాయ సమీక్ష పరిధి నుంచి తప్పించారని అమిత్‌షా ప్రస్తావించారు. ఇద్దరి మధ్య తేడాను గుర్తించాలన్నారు. యూపీఏ హయాంలో శిక్షపడ్డ ఎంపీలను కాపాడే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తే రాహుల్‌గాంధీ చించి పారేశారని అమిత్ షా గుర్తు చేశారు. అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌కు శిక్ష పడ్డా ఆయనకు అండగా నిలుస్తోందని చెప్పారు. రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ వరుసగా మూడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన నైతిక ప్రమాణాల్లో రాజీ పడ్డారని ఎద్దేవా చేశారు.
కోర్టులు కళ్లు మూసుకొని కూర్చోవు
సుప్రీంకోర్టు, హైకోర్టులు కళ్లు మూసుకొని కూర్చోలేదని, ఒక సీఎంపై తప్పుడు కేసు పెడితే కోర్టులు బెయిలిస్తాయని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఎక్కువ మంది సీఎంలు, ప్రధాని ఎన్డీయే వారేనని గుర్తు చేశారు. ఎన్డీయే సీఎంలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులే పెట్టడం లేదని చేస్తున్న వాదనను కొట్టిపారేశారు. వారు అవినీతిపరులైతే విపక్షాలు కోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు వేసి కేసు నమోదుకు ఆదేశాలు తెచ్చుకోవచ్చన్నారు. గతంలో చాలామంది సీఎంలు జైలుకు వెళ్లారని, వాళ్లు నైతిక బాధ్యత వహించి రాజీనామాలు చేశారని, ఇప్పుడు అలా చేయకపోవడం వల్లే ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సి వస్తోందని అన్నారు.
రెండేళ్లు రాష్ట్రానికి దూరంగా ఉన్నా
సొహ్రబుద్దీన్ షేక్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసు విచారణను తాను ప్రభావితం చేస్తానేమోనని కేసును విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ అఫ్తాబ్ ఆలం సందేహం వెలిబుచ్చిన నేపథ్యంలో తానే విచారణ పూర్తయ్యే వరకు రాష్ట్రం విడిచి వెళతానని ప్రతిపాదించానని అమిత్‌షా వెల్లడించారు. రెండేళ్లు రాష్ట్రం వెలుపల ఉండటం తన స్వీయ నిర్ణయమని చెప్పారు. సాధారణంగా ఒక బెయిలు అప్లికేషన్‌ను 11 రోజుల్లో పరిష్కరిస్తారని, తన బెయిలు దరఖాస్తును పరిష్కరించడానికి రెండేళ్ల సమయం తీసుకున్నారని, అన్ని రోజులు తాను రాష్ట్రం వెలుపల ఉండాల్సి వచ్చిందని చెప్పారు. తనపై సీబీఐ కేసు నమోదు చేయగానే మంత్రి పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. కేసు పూర్తిగా కొట్టేసే వరకు ఎలాంటి పదవులు చేపట్టలేదన్నారు. చివరికి ఈ కేసు రాజకీయ ప్రతీకారంతో పెట్టిందేనని న్యాయస్థానం స్వయంగా తేల్చిందని ప్రస్తావించారు.
అమిత్ షా వ్యాఖ్యలు దురదృష్టకరం
న్యూఢిల్లీ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): జస్టిస్ సుదర్శన్ రెడ్డికి వ్యతిరేకంగా అమిత్ షా వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు, హైకోర్టులకు చెందిన 18 మంది మాజీ న్యాయమూర్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమిత్ షా వ్యాఖ్యలు దురదృష్టకరమని వారు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఆ తీర్పులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎక్కడా నక్సలిజాన్ని, దాని సిద్దాంతాలను సమర్థించలేదని.. ఆ తీర్పు సారాంశంలో ఎక్కడా అలాంటి ఉద్దేశం లేదని వారు స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి పదవికి జరిగే ప్రచారం మర్యాదగా, హుందాగా ఉండాలన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దేశంలో ఉన్నత స్థానంలో ఉన్న ఒక వ్యక్తి దురుద్దేశంతో వక్రీకరించడం న్యాయవ్యవస్థ స్వతంత్రతను కుదిపివేస్తుందని ఆందోళన వెలిబుచ్చారు. ఈ ప్రకటనపై ఏడుగురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఏకే పట్నాయక్, జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ గోపాల గౌడ, జస్టిస్ విక్రంజిత్ సేన్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ జె.చలమేశ్వర్.. ముగ్గురు హైకోర్టు మాజీ సీజేలు గోవింద్ మాథూర్, బి.మురళీధర్, సంజీబ్ బెనర్జీ, 8 మంది హైకోర్టు మాజీ న్యాయమూర్తులు సి.ప్రవీణ్ కుమార్, ఎ.గోపాల్ రెడ్డి, జి.రఘురామ్, కె.కన్నన్, కె.చంద్రు, బి.చంద్రకుమార్, కైలాష్ గంభీర్ సంతకం చేశారు.
Also Read:
గుండె జబ్బులకు దారితీసే మూడు కారణాలు ఇవే..
కోహ్లీ బ్యాట్ వల్ల నాకు బ్యాడ్ నేమ్..
For More Telangana News and Telugu News..