Share News

Maha Kumbh stampede: కుంభమేళా తొక్కిసలాటకు పది కారణాలు..

ABN , Publish Date - Jan 29 , 2025 | 04:20 PM

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనకు వెనకగల 10 కారణాలు ఇవే..

Maha Kumbh stampede: కుంభమేళా తొక్కిసలాటకు పది కారణాలు..
10 Reasons Behind MahaKumbha Mela Stampade

పవిత్ర మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట కారణంగా పదుల సంఖ్యలో భక్తులు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. మౌని అమవాస్య కావడంతో బుధవారం కోట్లాది మంది భక్తులు వస్తారని ముందే అంచనా వేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని, అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటిస్తూవచ్చింది. కానీ బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట కారణంగా పదుల సంఖ్యలో భక్తులు చనిపోయారు. మహా కుంభమేళ ప్రాంగణంలో ఏమి జరుగుతుందో కాసేపు ఎవరికి అర్థం కాలేదు. అసలు కుంభమేళాలో తొక్కిసలాటకు గల పది కారణాలు ఏమిటో తెలుసుకుందాం..


1) మౌని అమవాస్య కావడంతో పది కోట్ల మందికిపైగా భక్తులు వస్తారని తెలిసినప్పటికీ అనుకున్నస్థాయిలో ఏర్పాట్లు చేయడకపోవడాన్ని ఒక కారణంగా చెబుతున్నారు.

2) క్యూలైన్లను సక్రమంగా ఏర్పాటు చేయకపోవడంతో తొక్కిసలాట జరిగిందని కొందరు భక్తులు అభిప్రాయపడుతున్నారు

3)వెలుతురు సరిగ్గా లేకపోవడం, చీకటిగా ఉండటం కారణంగా తొక్కిసలాట జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

4) చెత్త వేయడానికి ఏర్పాటు చేసిన ఇనుప డెస్ట్‌బిన్లు తెల్లవారుజామున కనిపించకపోవడంతో వాటిని తన్ని చాలామంది కింద పడిపోయారని, దీంతో కింద పడినవాళ్ల మీద నుంచి నడుచుకుంటూ వెళ్లడంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

5)భద్రతా ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలను ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి.


6) సామాన్య భక్తులతో పాటు వీఐపీ భక్తుల తాకిడి అధికంగా ఉండటం తొక్కిసలాటకు ఒక కారణంగా చెబుతున్నారు.

7)క్యూలైన్లు ఏర్పాటుచేసి భక్తులను బ్యాచ్‌లవారీ స్నానాలకు అనుమతిస్తే రద్దీలో తొక్కిసలాటకు అవకాశం లేకుండా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

8) అధిక రద్దీతో పాటు భక్తులు ముందుకు కదలకపోవడంతో తోపులాట జరిగిందని మరికొందరు చెబుతున్నారు

9) విపరీతమైన రద్దీతో స్నానాలకు ఎటు వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితులే తోపులాటకు కారణమనే వాదన వినిపిస్తోంది

10) పుణ్య స్నానాలకోసం వచ్చే భక్తులకు సరైన మార్గదర్శకత్వం లేకపోవడమూ తొక్కిసలాటకు కారణమనే అబిప్రాయాన్ని కొందరు భక్తులు వ్యక్తం చేస్తున్నారు.


ఏది ఏమైనా మహభా కుంభమేళాలో తొక్కిసలాటకు కారణం ఏమిటనేదానిపై పోలీసులు విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉందనే అభిప్రాయాన్ని భక్తులు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jan 29 , 2025 | 04:20 PM