Modi Macron Phone Talks: పీఎం మోదీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ శాంతి చర్చలు.. ఫలించేనా..
ABN , Publish Date - Aug 21 , 2025 | 08:01 PM
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య ఫోన్ ద్వారా కీలక చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య అనుబంధాన్ని బలపరిచేలా, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులపై శాంతియుత పరిష్కారాల దిశగా ఈ సంభాషణ సాగింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య ఫోన్‌లో శాంతి చర్చలు (Modi Macron Phone Talks) జరిగాయి. ఈ ఇద్దరు నేతలు యుద్ధాలు కమ్ముకుంటున్న ఉక్రెయిన్, వెస్ట్ ఆసియా అంశాలపై ప్రత్యేకంగా చర్చించడం విశేషం. దీనిపై మోదీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. నా స్నేహితుడు మాక్రాన్‌తో మంచి సంభాషణ జరిగింది. ఉక్రెయిన్, వెస్ట్ ఆసియాలో శాంతి స్థాపన కోసం తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలు పంచుకున్నామని అన్నారు.
శాంతి కోసం చర్చలు
ఈ సమావేశంలో మోదీ, మాక్రాన్ ప్రధానంగా రెండు అంశాలపై ఫోకస్ చేశారు. ఒకటి ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం, రెండోది, పశ్చిమ ఆసియాలో కొత్తగా తలెత్తిన ఉద్రిక్తతలు. ఈ పరిస్థితుల్లో శాంతిని తిరిగి నెలకొల్పడానికి దౌత్యపరమైన చర్చలు, సంప్రదింపులు ఎంతో కీలకమని ఇద్దరూ అంగీకరించారు. మేము శాంతియుత పరిష్కారాల కోసం కృషి చేస్తున్నామని మోదీ అన్నారు. అంటే, యుద్ధాలు కాదు, మాటలతోనే సమస్యలను పరిష్కరించాలనేది వీరి ఉద్దేశం.
బలపడుతున్న భారత్-ఫ్రాన్స్ స్నేహం
ఈ చర్చల్లో శాంతి చర్చలతో పాటు భారత్-ఫ్రాన్స్ మధ్య స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్‌ను మరింత బలోపేతం చేయడంపై కూడా ఫోకస్ చేశారు. రక్షణ, అంతరిక్షం, ఇంధన మార్పిడి, గ్లోబల్ గవర్నెన్స్‌లో ఈ రెండు దేశాలు ఎప్పటి నుంచో కలిసి పనిచేస్తున్నాయి. ఈ సంబంధాన్ని మరింత విస్తరించాలని ఇద్దరూ నిర్ణయించారు. భారత్, ఫ్రాన్స్ రెండూ G20, ఐక్యరాష్ట్ర సమితి (UN) వంటి అంతర్జాతీయ వేదికల్లో శాంతియుత పరిష్కారాలకు సపోర్ట్ చేశాయి. అందుకే, ఈ చర్చలు ఆసక్తికరంగా మారాయి.
శాంతి దూరమవుతోందా?
ఇదే సమయంలో, ఉక్రెయిన్‌లో రష్యా తన దాడులను మరింత తీవ్రతరం చేసింది. గురువారం రష్యా 574 డ్రోన్‌లు, 40 బాలిస్టిక్, క్రూయిజ్ మిస్సైళ్లతో ఉక్రెయిన్‌పై భారీ దాడి చేసింది. ఈ దాడుల్లో ఒకరు మరణించారు, 15 మంది గాయపడ్డారు. ల్వివ్‌లో రెసిడెన్షియల్ ఏరియాలు, స్కూళ్లు, అడ్మినిస్ట్రేషన్ భవనాలు ధ్వంసమయ్యాయి. రష్యా మాత్రం తాము సైనిక-పారిశ్రామిక స్థావరాలను టార్గెట్ చేశామని చెబుతోంది. కానీ, ఉక్రెయిన్ అధికారులు ఈ దాడులు పౌర ప్రాంతాలపైనే జరిగాయని ఆరోపిస్తున్నారు.
శాంతి కోరుకోవడం లేదా
ఈ దాడుల్లో ఒక అమెరికన్ కంపెనీ ఫ్లెక్స్ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ కూడా దెబ్బతింది. ఈ ప్లాంట్ ఉక్రెయిన్‌లో అమెరికా చేసిన పెద్ద పెట్టుబడుల్లో ఒకటి. ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారు. రష్యా శాంతి కోరుకోవడం లేదు, అమెరికన్ వ్యాపారాలను కూడా టార్గెట్ చేస్తోందని అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఆండీ హండర్ అన్నారు.
జెలెన్‌స్కీ రియాక్షన్
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ ఈ దాడులను ఖండిస్తూ, రష్యా పరిస్థితిని మార్చడానికి ఆసక్తి చూపడం లేదని అన్నారు. ఉక్రెయిన్ సీజ్‌ఫైర్, డైరెక్ట్ టాక్స్‌కు సిద్ధంగా ఉన్నప్పటికీ, రష్యా సానుకూలంగా స్పందించడం లేదన్నారు. తమ మిత్రదేశాలతో కలిసి సెక్యూరిటీ గ్యారంటీల ప్యాకేజీపై పనిచేస్తున్నామని, మరో 10 రోజుల్లో దీని వివరాలు వెల్లడిస్తామన్నారు.
2022 రష్యా దాడి తర్వాత మొదటిసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో డైరెక్ట్ చర్చలకు సిద్ధమని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి త్రైపాక్షిక చర్చలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, టర్కీ లాంటి దేశాలు ఈ చర్చలకు వేదికగా ఉండొచ్చు.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి