TVK Thalapathy Vijay: 2026 తమిళనాడు ఎన్నికల్లో పొత్తు గురించి విజయ్ కీలక ప్రకటన
ABN , Publish Date - Aug 21 , 2025 | 06:38 PM
దళపతి విజయ్ సినిమాల్లో హీరోగా కొనసాగుతుండగా, తాజాగా మదురై వేదికపై మాత్రం ఓ కొత్త నాయకుడిగా కనిపించారు. రెండో రాష్ట్రస్థాయి సమావేశంలో విజయ్ స్పీచ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
దళపతి విజయ్ సినిమా స్టార్ మాత్రమే కాదు, రాజకీయ నాయకుడిగా సరికొత్త ట్రెండ్ సృష్టించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళగ వెట్రి కళగం (TVK) రెండో రాష్ట్ర సమావేశం మదురైలో జరుగగా.. విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు ఇతర పార్టీలతో పొత్తుల గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.
సింగిల్‌గా సింహంలా
ఈ క్రమంలో మాట్లాడిన విజయ్. మా ఏకైక భావజాల శత్రువు బీజేపీ, మా రాజకీయ శత్రువు డీఎంకే అంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ రెండు పార్టీలతో పొత్తు ఉండదన్నారు. TVK ఒంటరిగా నిలబడుతుందని, ఎవరికీ భయపడదని స్పష్టం చేశారు. అడవిలో నక్కలు ఎన్ని ఉన్నా, సింహం ఒక్కటే రాజు అని.. దాని గర్జన చాలా దూరం వరకు వినిపిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో సింహం ఎప్పుడూ సింహమే అంటూ సమావేశంలో జనాలను ఉత్తేజపరిచారు. ఈ క్రమంలో 2026 తమిళనాడు రాజకీయాల్లో తమ పార్టీ, డీఎంకే మధ్య పోటీ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మదురై నుంచి తమిళ గర్జన
విజయ్ తన ప్రసంగంలో మదురై గొప్పతనాన్ని ప్రస్తావించారు. అలంగనల్లూర్ జల్లికట్టు, మీనాక్షి అమ్మన్ ఆలయం ఇవన్నీ తమిళ ప్రజల ధైర్యం, సంప్రదాయాలకు చిహ్నాలని గుర్తు చేశారు. 1967, 1977లో తమిళనాడు రాజకీయాల్లో జరిగిన చారిత్రక మార్పులను గుర్తు చేస్తూ, 2026లో అలాంటి మరో మార్పుకు తాను నాయకత్వం వహిస్తానని ధీమా వ్యక్తం చేశారు. నేను రాజకీయాల్లోకి రానన్నారు, ఓట్లు వేయరన్నారు. కానీ నేను తమిళనాడు గుండె చప్పుడు మాత్రమే వింటానని, మిగతా విమర్శలను చూసి నవ్వుతానని విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు.
జనం సమస్యలతో కనెక్ట్
విజయ్ తన ప్రసంగంలో కేవలం రాజకీయ గర్జనలతో ఆగిపోలేదు. తమిళ జాలర్ల సమస్యలు, కచ్చతీవు తిరిగి తీసుకోవాలనే డిమాండ్, నీట్ రద్దు చేయాలనే అంశాలను ప్రస్తావించారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి TVK గట్టిగా పోరాడుతుందని హామీ ఇచ్చారు. విజయ్ తనను తాను సింహంతో పోల్చుకున్నారు. TVK ఎవరి మద్దతు లేకుండానే తమిళనాడు రాజకీయాల్లో స్థానం సంపాదిస్తుందన్నారు. మేం ఎవరితోనూ జట్టు కట్టం. మా పోరాటం మాదే, నేను ముందుండి నడిపిస్తానని స్పష్టం చేశారు విజయ్.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి