Share News

Pakistan Saudi Arabia:పాకిస్తాన్‌కు అండగా సౌదీ అరేబియా.. రక్షణ ఒప్పందంపై కీలక నిర్ణయం

ABN , Publish Date - Sep 18 , 2025 | 08:37 AM

ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్, సౌదీ అరేబియా ఇప్పుడు మరింత సన్నిహితంగా మారాయి. దీంతో యుద్ధ వేదికపై ఒక్కటిగా కొనసాగనున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Pakistan Saudi Arabia:పాకిస్తాన్‌కు అండగా సౌదీ అరేబియా.. రక్షణ ఒప్పందంపై కీలక నిర్ణయం
Pakistan Saudi Arabia

పాకిస్తాన్, సౌదీ అరేబియా (Pakistan Saudi Arabia) కలిసి ఒక కీలకమైన రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం పేరు స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ (Strategic Mutual Defense Agreement). దీని ప్రకారం, ఒక దేశంపై దాడి జరిగితే, అది రెండో దేశంపై దాడిగా పరిగణిస్తారట అంటే, ఇకపై ఈ రెండు దేశాలు ఒకరికొకరు గట్టిగా సపోర్ట్ చేసుకోబోతున్నాయి.


ఈ ఒప్పందంపై సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్య సంతకం జరిగింది. షెహబాజ్ షరీఫ్, క్రౌన్ ప్రిన్స్ ఆహ్వానం మేరకు సౌదీ అరేబియాకు వెళ్లారు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ఏదైనా దాడిని ఎదుర్కొనేందుకు ఉమ్మడిగా సన్నద్ధం కావడం లక్ష్యంగా పెట్టుకుంది.


ఇటీవల ఇజ్రాయెల్.. ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నాయకులపై వైమానిక దాడి చేసింది. ఈ దాడిని అమెరికా ఏకపక్ష దాడి అని విమర్శించింది. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఎప్పటి నుంచో రక్షణ కవచంలా ఉంటోంది. కానీ ఈ దాడి వాళ్ల ప్రయోజనాలకు వ్యతిరేకమని చెప్పింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్-సౌదీ ఒప్పందం ఆసక్తికరంగా మారింది.


ఈ ఒప్పందం వెనుక మరో కీలక నేపథ్యం ఉంది. కొన్ని నెలల క్రితం, భారత్-పాకిస్తాన్ మధ్య నాలుగు రోజుల సైనిక ఘర్షణ జరిగింది. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. ఈ దాడికి పాకిస్తాన్‌తో సంబంధాలున్న ఉగ్రవాదులు కారణమని తేలడంతో, భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో ప్రతీకార దాడులు చేసింది. ఆ ఘర్షణతో చివరికి పాకిస్తాన్ డీజీఎంఓ, భారత డీజీఎంఓతో మాట్లాడి ఆపేసింది.


మరోవైపు ఇజ్రాయెల్ గత వారం హమాస్ రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని దోహాలో దాడి చేసింది. ఈ దాడిలో ఆరుగురు మరణించారు. అందులో ఖతార్ భద్రతా దళాల సభ్యుడూ ఉన్నారు. ఖతార్ ఈ దాడిని ఉగ్రవాదం అని తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం, ఈ దాడి పూర్తిగా స్వతంత్ర నిర్ణయమని, హమాస్ ఉగ్రవాద నాయకులనే లక్ష్యం చేసుకుని చేసినట్లు చెప్పింది.

ఖతార్, అమెరికా కూడా ఒక మెరుగైన రక్షణ సహకార ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉన్నాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం, ఇజ్రాయెల్ దాడి గురించి తనకు ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నారు.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 18 , 2025 | 08:40 AM