Israel Iran Conflict: ఇరాన్ ప్రభుత్వ మీడియాపై దాడి.. లైవ్‌లో పారిపోయిన యాంకర్..
ABN , Publish Date - Jun 17 , 2025 | 07:16 AM
Israel bombs Iran TV studio: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. టెల్ అవీవ్ బాంబు దాడికి లైవ్‌లో వార్తలు చదువుతున్న యాంకర్ ప్రాణభయంతో పరుగులు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
Iran TV anchor bombing: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పోరు నాలుగో రోజున కూడా భీకరంగా సాగింది. మొదట టెహ్రాన్ ఏకంగా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. ఈ దాడిలో సుమారు 11 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందగా.. 300ల మందికి పైగా గాయపడ్డారు. ఇందుకు ప్రతీకారంగా టెల్ అవీవ్ కూడా రెచ్చిపోయింది. గగనతలం నుంచి ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా ఛానల్ పై బాంబు దాడి చేసింది. ఆ సమయంలో స్టూడియోలో వార్తలు చదువుతున్న మహిళా యాంకర్ ప్రాణభయంతో ఒక్కసారిగా పరుగులుపెట్టింది. లైవ్‌లో వార్తలు చదువుతున్న న్యూస్ రీడర్ పారిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
ఇజ్రాయెల్ టెహ్రాన్‌లో ఉన్న ఇరాన్ ప్రభుత్వ ఛానల్ IRIB ప్రధాన కార్యాలయంపై సోమవారం బాంబు దాడి చేసింది. భారీ పేలుడు శబ్దాలు రావడంతో ప్రత్యక్ష ప్రసారంలో వార్తలు చదువుతున్న న్యూస్ రీడర్ ప్రాణభయంతో పరుగులు పెట్టింది. హిజాబ్ ధరించిన మహిళా యాంకర్ భయంతో తన సీటు నుంచి లేచి పారిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యాంకర్ వెళ్లిన మరుక్షణమే దట్టమైన నల్లటి పొగ స్టూడియోని చుట్టుముట్టి శిథిలాలు రాలిపడటం వీడియోలో గమనించవచ్చు.
అయితే, బాంబు దాడి జరిగిన వెంటనే IRIB ప్రత్యక్ష ప్రసారాలను తిరిగి ప్రారంభించింది. ఐఆర్‌ఐబి కార్యాలయాలపై జరిగిన దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇది 'దుష్ట చర్య', 'యుద్ధ నేరం' అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఖై అభివర్ణించారు. తమ ప్రజలపై భీకర దాడులతో దారుణాలకు తెగబడుతున్న ఇజ్రాయెల్ పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) చర్య తీసుకోవాలని కోరారు. శత్రుదేశం ఇజ్రాయెల్ సైనిక చర్యతో ఇస్లామిక్ విప్లవాన్ని, ఇరాన్ స్వరాన్ని అణచివేయలేదని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకూ 200మందికి పైగా ఇరాన్ వాసులు ప్రాణాలు కోల్పోయారు.
ఇవీ చదవండి:
పాక్ ప్రకటనలు అవాస్తవం.. దసో ఏవియేషన్ స్పష్టీకరణ
36 దేశాలపై ట్రావెల్ బ్యాన్.. యోచనలో అమెరికా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి