Canada Crime: కెనడాలో భారతీయ మహిళ హత్య.!
ABN , Publish Date - Dec 24 , 2025 | 11:40 AM
కెనడా దేశంలో ఇండియాకు చెందిన ఓ మహిళ హత్యకు గురయ్యారు. ఈ విషయమై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది అక్కడి భారతీయ రాయబార కార్యాలయం. పూర్తి వివరాల్లోకెళితే..
ఇంటర్నెట్ డెస్క్: కెనడాలోని(Canada) టొరంటోలో హిమాన్షీ ఖురానా(Himanshi Khurana) అనే 30 ఏళ్ల భారతీయ మహిళ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించి అనుమానితుడిగా భావిస్తోన్న అబ్దుల్ గఫూరీ(Abdul Ghafoori) కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ జరిగింది..
డిసెంబర్ 19న ఖురానా అదృశ్యమైనట్టు పోలీసులకు సమాచారం అందింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి ఓ ఇంట్లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఖురానాపై తొలుత లైంగిక దాడి జరిగినట్టు అనుమానం వ్యక్తం చేసిన అధికారులు.. ఆపై హత్యకు గురైనట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా.. గఫూరీతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఈ హత్యకు అబ్దుల్ గఫూరీకి సంబంధముందని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగా పరారీలో ఉన్న గఫూరీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అనుమానిత నిందితుణ్ని పట్టుకోవడంలో భాగంగా ఇప్పటికే అతడి ముఖ చిత్రాన్ని కూడా విడుదల చేసినట్టు తెలిపారు.
ఈ హత్యోదంతంపై కెనడాలోని భారతీయ రాయబార కార్యాలయం(Indian Embassy) దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధితురాలి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపింది. ఈ హత్యకు సంబంధించి నిందితుణ్ని పట్టుకోవడంలో భాగంగా అక్కడి దర్యాప్తు బృందంతో కలిసి పనిచేస్తున్నామంది. స్థానిక అధికారుల సమన్వయంతో మృతురాలి కుటుంబానికి అవసరమైన మేర సాయమందించేందుకు కృషి చేస్తున్నట్టు పేర్కొంది.
ఇవీ చదవండి: