Share News

India Lobbying USA: అమెరికాలో భారత్‎కు రెండో లాబీయింగ్ సంస్థ..వర్క్ అవుట్ అవుతుందా..

ABN , Publish Date - Aug 25 , 2025 | 09:26 AM

అమెరికాలో భారత రాయబార కార్యాలయం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఒక లాబీయింగ్ సంస్థతో చేతులు కలిపిన భారత్, ఇప్పుడు మరొక సంస్థ సేవలను కూడా వినియోగించుకోనుంది. అయితే ఈ సంస్థలు ఏం చేస్తాయి, వీటి ఉపయోగాలు ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

India Lobbying USA: అమెరికాలో భారత్‎కు రెండో లాబీయింగ్ సంస్థ..వర్క్ అవుట్ అవుతుందా..
India Lobbying USA

అమెరికాలో భారత రాయబార కార్యాలయం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఒక లాబీయింగ్ సంస్థతో (India Lobbying USA) ఒప్పందం ఉన్నప్పటికీ, త్వరలో అమల్లోకి రానున్న భారీ సుంకాలను (Tariffs) ఎదుర్కొనేందుకు రెండవ సంస్థను కూడా రంగంలోకి దించింది. దీనికి గల కారణాలేంటి? అసలు ఈ సంస్థలు ఏం చేస్తాయి? మనకు లాభమేనా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.


50% టారిఫ్ భారత్‌కు దెబ్బ

అమెరికా ప్రభుత్వం భారత ఎగుమతులపై 50% టారిఫ్ విధించబోతోంది. అంటే మన దేశం నుంచి అమెరికాకు పంపే కొన్ని ఉత్పత్తులపై అదనపు పన్నులు వేయనున్నారు. ఇది మన ఎగుమతులకు పెద్ద దెబ్బే. ఇలాంటి పరిస్థితిలో అమెరికాలో భారత్‌కు మద్దతుగా వాదిస్తూ, నెగెటివ్ ప్రచారాన్ని ఎదుర్కొంటూ మనకు అనుకూలంగా ఉంటూ లాబీయింగ్ సంస్థలు కీలకంగా పనిచేస్తాయి.


కొత్తగా రంగంలోకి

భారత రాయబార కార్యాలయం తాజాగా Mercury Public Affairs అనే లాబీయింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, మూర్చరి సంస్థకు నెలకు $75,000 (సుమారుగా రూ.62 లక్షలు) చెల్లించనున్నారు. ఆరు లక్షల డాలర్ల విలువైన ఈ ఒప్పందం ఆగస్ట్ 15 నుంచి మూడు నెలల పాటు అమలులో ఉంటుంది.

ఈ సంస్థకు చెందిన ప్రముఖులలో డేవిడ్ విటర్ – మాజీ రిపబ్లికన్ సెనేటర్, బ్రయాన్ లాంజా – ట్రంప్ ట్రాన్సిషన్ టీమ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ (2020), న్యూయార్క్ రాష్ట్రానికి చెందిన మొదటి భారతీయ అమెరికన్ సెనేటర్ కెవిన్ థామస్ ఈ టీంలో ఉన్నారు.


ట్రంప్ శిబిరానికి సంబంధాలు

Mercury సంస్థకు ట్రంప్ మద్దతుదారులతో అనేక సంబంధాలు ఉన్నాయి. ఉదాహరణకి ట్రంప్-పంచ్ ప్రచార బృందంలో కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా పనిచేసిన బ్రయాన్ లాంజా ఈ సంస్థలో కీలక నేత. మరికొంత కాలం క్రితం వరకు ట్రంప్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉన్న సూసీ వైల్స్ కూడా ఇదే సంస్థలో లాబీయిస్ట్‌గా పనిచేశారు.

ఇదే మొదటిసారి కాదు

ఇది కొత్త విషయం కాదు. ఇప్పటికే భారత్ ప్రభుత్వం SHW Partners LLC అనే మరో లాబీయింగ్ సంస్థను ఏప్రిల్ 2025లో నియమించింది. దీని కోసం మనం నెలకు $150,000 (రూ.1.25 కోట్లు) చెల్లిస్తున్నాం. మొత్తం ఒప్పందం విలువ $1.8 మిలియన్ (రూ.15 కోట్లకు పైగా). ఈ సంస్థను జేసన్ మిల్లర్ (మాజీ ట్రంప్ సలహాదారు) నిర్వహిస్తున్నారు.


ఎందుకు రెండో సంస్థ?

ఇటీవల పాకిస్తాన్ కూడా ట్రంప్ మాజీ బాడీగార్డ్ కీత్ షిల్లర్ సంస్థను నియమించుకోవడంతో, ఇండియా కాస్త వెనుకబడిందన్న విమర్శలు వచ్చాయి. అందుకే అమెరికాలో మీడియా, డిజిటల్, రాజకీయ వర్గాల్లో సమర్థవంతంగా ప్రచారం చేసేందుకు రెండో సంస్థను రంగంలోకి దించారు.

చాలా దేశాలు, కంపెనీలు 2 నుంచి 6 వరకు లాబీయింగ్ సంస్థలతో పని చేస్తుంటాయి. ఈ కొత్త నియామకంతో, భారత్ అమెరికా ప్రభుత్వంతో సమర్థవంతమైన చర్చలు జరపాలని, సుంకాల ప్రభావాన్ని తగ్గించాలని ఆశిస్తోంది. ట్రంప్ యంత్రాంగంతో బలమైన కనెక్షన్స్ ఉన్న మెర్క్యూరీ, ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్‌కు సహాయపడుతుందని భావిస్తోంది.


ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 25 , 2025 | 09:30 AM