Gaza Women Crisis: ఆహారం కోసం కోరిక తీరుస్తున్న గాజా మహిళలు.. అసలు ఏం జరుగుతోంది..?
ABN , Publish Date - Oct 02 , 2025 | 05:17 PM
గాజాలో మహిళలు పిల్లల కడుపు నింపడానికి ఒళ్లు అమ్ముకోవాల్సిన దారుణమైన పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఓ నేషనల్ మీడియాకు స్థానిక మహిళలు తమ దయనీయ పరిస్థితుల అనుభవాలను వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: హమాస్, ఇజ్రాయెల్ యుద్ధంతో గాజాలో దుర్బర పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ దిగ్బంధనంతో.. సరైన ఆహారం దొరకక వృద్ధులు, పిల్లలు మృత్యువాత పడుతున్నారు. డయేరియా వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. మార్కెట్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఆకలి, డీహైడ్రేషన్‌తో ప్రజలు వీధుల్లోనే కుప్పకూలుతున్నారు. ఈ నేపథ్యంలో గాజాలో తీవ్రమైన మానవతా సంక్షోభం కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితులను కొందరు దుండగులు.. అవకాశంగా తీసుకుని దారుణాలకు ఒడిగడుతున్నారు. సహాయం కోసం ఎదురుచూస్తున్న నిస్సహాయ మహిళలపై కొందరు పురుషులు లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు సంచలన ఆరోపణలు వెలువడుతున్నాయి. ఆహారం, ఉపాధి పేరుతో వారిని లైంగిక దోపిడీకి గురిచేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
గాజాలో తమ పిల్లల కడుపు నింపడానికి మహిళలు ఒళ్లు అమ్ముకోవాల్సిన దారుణమైన పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఓ నేషనల్ మీడియాకు స్థానిక మహిళలు తమ దయనీయ పరిస్థితుల అనుభవాలను వెల్లడించారు. ఈ లైంగిక దోపిడీకి పాల్పడుతున్న వారిలో ఐక్యరాజ్యసమితి సహాయక సంస్థ అయిన UNRWAకు చెందిన వాలంటీర్లు కూడా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తమ కోరికలు తీరిస్తే ఆహారం అందచేస్తామని కొందరు సహాయక సిబ్బంది గాజాలోని నిస్సహాయ మహిళలను లోబరుచుకుంటున్నట్లు తెలుస్తోంది. సహాయ వనరులను ఆయుధంగా వాడుకుంటూ లైంగిక చర్యల కోసం ఒత్తిడి చేస్తున్నట్లు బాధితులు వెల్లడించారు. తమ కోరికను తీరిస్తేనే సాయం, ఆహారం అందిస్తామని చెప్పి లోబర్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా సాయం ముసుగులో అకృత్యాలకు పాల్పడుతున్నట్లు బాధితులు పేర్కొన్నారు.
35 ఏళ్ల వితంతువు UNRWA ద్వారా సాయం పొందుతున్నప్పుడు ఓ ఉద్యోగికి తన ఫోన్ నంబర్ ఇచ్చింది. మొదట్లో మామూలుగా ఉన్న సంభాషణ.. రాత్రిపూట కాల్స్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో అతను తనను లైంగిక చర్యకు రావాలని కోరగా ఆమె నిరాకరించింది. ఫలితంగా, ఆ తర్వాత ఎటువంటి మానవతా సహాయం అందలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే.. తన పిల్లలకు తిండి పెట్టేందుకు వారాల తరబడి అష్టకష్టాలు పడుతున్న ఓ 38 ఏళ్ల మహిళకు తన ఏజెన్సీలో ఉద్యోగం ఇస్తానని సహాయ పంపిణీ కేంద్రం ఉద్యోగి నమ్మించాడు. అనంతరం ఓ అపార్ట్‌మెంట్‌కు ఆమెను తీసుకెళ్లి తన లైంగిక వాంఛను బయటపెట్టాడు. తన బిడ్డలకు కడుపునిండా తిండి దొరుకుతుందన్న ఆశతో ఆ తల్లి మనసు చంపుకుని అందుకు సిద్ధపడినప్పటికీ కొంత డబ్బు, ఆహారం చేతిలో పెట్టి ఆమెను పంపించివేశాడు. ఉద్యోగం ఇస్తానన్న హామీ మాత్రం ఎన్నాళ్లయినా నెరవేరలేదని బాధితురాలు మీడియాతో వాపోయింది. ఇలాంటి ఎన్నో దీనగాథలను బాధిత మహిళలు నేషనల్ మీడియాకు వెళ్లబోసుకున్నారు.
ఈ సంఘటనలపై స్థానిక వైద్యులు స్పందించారు. చాలా మంది మహిళలు తమకు లైంగిక దోపిడీ గురించి చెప్పారని తెలిపారు. దీని కారణంగా కొందరు గర్భవతులు అయినట్లు పేర్కొన్నారు. UNRWA సభ్యునిగా ఉన్న గ్లోబల్ ప్రొటెక్షన్ క్లస్టర్(GPC) విడుదల చేసిన నివేదికలోనూ గాజాలోని సహాయక కార్యకర్తల వర్గాలపై హింస, దోపిడీ, అక్రమ రవాణా, బలవంతపు వ్యభిచారం వంటి లైంగిక దోపిడీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. మానవతా సంక్షోభాలు లైంగిక హింసను పెంచుతాయని, గాజాలోని పరిస్థితి ముఖ్యంగా మహిళలు, బాలికలకు మాటల్లో చెప్పలేనిదని వారు వ్యాఖ్యనించారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ పరిస్థితులు అత్యంత భయకరంగా మారే ప్రమాదం ఉందని, ప్రభుత్వాలు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధర తగ్గేదేలే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
టాప్ ప్లేస్‌లో అంబానీ.. దేశంలో అత్యంత సంపన్నులు వీరే..