Trump Putin Meeting: ట్రంప్- పుతిన్ ఆలాస్కా భేటీ.. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దిశగా అడుగులేనా?
ABN , Publish Date - Aug 09 , 2025 | 06:47 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ గురించి కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం పరిష్కారం కోసం ఆగస్టు 15, 2025న అలస్కాలో సమావేశం కానున్నట్లు వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య భేటీ తేదీ ఎట్టకేలకు ఖరారైంది. వీరిద్దరూ కలిసి వచ్చే వారం అంటే ఆగస్టు 15న అలాస్కాలో సమావేశం (Trump Putin Alaska Meeting) కానున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ తన అధికారిక Truth Social మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ సమావేశానికి ముందు పుతిన్ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీలతో మాట్లాడనున్నారు.
మీటింగ్ ఎందుకు ముఖ్యం?
రష్యా 2022లో ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి ఈ యుద్ధం ఆగకుండా కొనసాగుతోంది. దీంతో లక్షలాది మంది తమ ఇళ్లను వదిలి పారిపోయారు, వేలాది మంది చనిపోయారు. ఈ యుద్ధం ఆపడానికి ఇప్పటివరకు మూడు సార్లు చర్చలు జరిగినా, ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు ట్రంప్, అలస్కాలో పుతిన్‌తో మాట్లాడి ఈ సమస్యకు ఒక ముగింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య భూభాగాలను మార్చుకోవడం ద్వారా ఈ యుద్ధాన్ని ఆపొచ్చని ట్రంప్ ఆలోచన. అంటే, రెండు దేశాలూ కొంత భూమిని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటే, శాంతి సాధ్యమవుతుందని ట్రంప్ భావిస్తున్నారు. కానీ, ఈ ఆలోచన ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి మరి.
పుతిన్ రెడీనా?
అయితే పుతిన్ ఈ భేటీ గురించి ఇంకా ధృవీకరణ ఇవ్వలేదు. ఆయన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఈ విషయంపై చర్చించారట. చైనా, భారత్ రెండూ ఈ యుద్ధానికి శాంతియుత పరిష్కారం కోసం తమదైన ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ పెద్దగా ఫలితం కనిపించలేదు. పుతిన్ గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీతో చర్చలు జరపడానికి సిద్ధంగా లేమని చెప్పారు. ఆయన అభిప్రాయం ప్రకారం, చర్చలు చివరి దశలో ఉన్నప్పుడే జెలెన్‌స్కీతో మాట్లాడతారట. కానీ జెలెన్‌స్కీ మాత్రం, శాంతి చర్చల్లో ఉక్రెయిన్ కూడా ఉండాలని, అది న్యాయమైనదని అంటున్నారు.
రష్యా డిమాండ్స్ ఏంటి?
గత నెలలో ఇస్తాంబుల్‌లో జరిగిన చర్చల్లో రష్యా కొన్ని కఠినమైన డిమాండ్లు పెట్టింది. ఉక్రెయిన్ తమ నియంత్రణలో ఉన్న కొన్ని భూభాగాలను వదులుకోవాలని, అలాగే పాశ్చాత్య దేశాల సైనిక సహాయాన్ని తిరస్కరించాలని రష్యా కోరింది. ఇవి చాలా పెద్ద డిమాండ్లు కాబట్టి, ఉక్రెయిన్ ఒప్పుకోవడం కష్టమే.
అలస్కా ఎందుకు?
అలస్కా అనేది అమెరికాకు చెందిన రాష్ట్రం, రష్యాకు దగ్గరగా ఉంటుంది. ఈ భేటీకి అలస్కాను ఎంచుకోవడం వెనుక ట్రంప్ ఆలోచన ఏమిటో స్పష్టంగా తెలియదు. కానీ ఇది ఒక స్ట్రాటజిక్ ఎంపిక కావొచ్చు. ఇది ట్రంప్, పుతిన్‌ల మధ్య 2019 తర్వాత మొదటి సారి సిట్టింగ్ ప్రెసిడెంట్స్‌గా జరిగే భేటీ అని చెప్పవచ్చు. వీళ్లిద్దరూ జనవరి నుంచి ఫోన్‌లో చాలా సార్లు మాట్లాడుకున్నారు, కానీ ఇలా డైరెక్ట్‌గా కలవడం ఇదే మొదటిసారి.
ఈ భేటీ ఫలితం?
ఈ భేటీ శాంతిని తీసుకొస్తుందా లేక మళ్లీ ఒక విఫలమైన చర్చగా మిగిలిపోతుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ట్రంప్ ఆలోచనలు, పుతిన్ డిమాండ్లు, ఉక్రెయిన్ ఆశలు ఇవన్నీ ఒకదానితో ఒకటి సరిపోలాలంటే కొంచెం కష్టమేనని నిపుణులు అంటున్నారు. కానీ, ఈ సమావేశం చివరకు ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపునకు దారి తీస్తుందా లేదా అనేది చూడాలి మరి.
ఇవి కూడా చదవండి
ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? లేక మారటోరియం తీసుకోవాలా?
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి