Tariffs on Canada: మెక్సికో తరువాత కెనడాకు ఊరట.. ట్రంప్ సుంకాల విధింపు వాయిదా
ABN , Publish Date - Mar 07 , 2025 | 10:04 AM
మెక్సికో, కెనడాపై సుంకాల విధింపును వాయిదా వేస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఏప్రిల్ 2 వరకూ వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో, మార్కెట్లకు ఊరట దక్కినట్టైంది.

ఇంటర్నెట్ డెస్క్: సుంకాల విధింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనకడుగు వేశారు. మెక్సికో తరువాత కెనడాపై కూడా తాత్కాలికంగా సుంకాల విధింపును వాయిదా వేస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో, కెనడా కూడా ప్రతీకార సుంకాల విధింపును విరమించుకుంది. దీంతో, అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లకు ఊరట లభించినట్టైంది. ధరాభారం నుంచి అమెరికా ప్రజలకు కూడా కాస్త సాంత్వన లభించింది.
మంగళవారం నుంచి 25 శాతం సుంకాల విధింపు అమల్లోకి రావడంతో ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు లోనైన విషయం తెలిసిందే. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న ఆందోళన తీవ్రమైంది. ఇది మరింత తీవ్ర పరిస్థితులకు దారి తీస్తుందన భయాలు పతాకస్థాయికి చేరడంతో డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధింపును వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 2 వరకూ సుంకాల విధింపును వాయిదా వేశారు. అయితే, మార్కెట్ల ఒడిదుడుకుల కారణంగా తానీ నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు
Retaliatory Tariffs: 2 నుంచి భారత్‌పై ప్రతీకార సుంకాలు
అయితే, కెనడా నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాలు కొనసాగుతాయని, అయితే, మునుపటి 25 శాతానికి బదులు 10 శాతం టారిఫ్ విధిస్తామని పేర్కొన్నారు. అమెరికా, మెక్సికో, కెనడాల మధ్య కుదిరిన యూఎస్‌ఎమ్‌సీఏ ఒప్పందం ప్రకారం, మూడు దేశాల మధ్య వాణిజ్యం జరుగుతున్న విషయం తెలిసిందే. సుంకాల విధింపు వాయిదా పడ్డప్పటికీ ఈ పరిస్థితి అమెరికా కార్ల తయారీదార్లకు అనుకూలంగా ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఏప్రిల్ 2 తరువాత ప్రతీకార సుంకాల తప్పవని యథాప్రకారం గర్జించారు.
ట్రంప్ ప్రకటనపై స్పందించిన కెనడా ఆర్థిక మంత్రి తాము కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాల విధింపును వాయిదా వేస్తున్నట్టు పేర్కొన్నారు. కార్ల విడి భాగాలపై సుంకాల విధింపునకు మినహాయింపు ఇచ్చినా స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై సుంకాల్లో స్థూలంగా ఎలాంటి మార్పులు ఉండవని అన్నారు. ట్రంప్ ప్రకటన అనంతరం, అమెరికా స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి.
Read Latest and International News