Share News

Health: ఇంటి పని, వంట పని, పిల్లల ఆలనాపాలన.. కునుకు కరవాయే..

ABN , Publish Date - Oct 12 , 2025 | 10:45 AM

ఆరోగ్యంగా ఉండాలంటే... రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. ఎప్పటి నుంచో వింటున్న మాట. నిద్ర ఒక సహజ సిద్ధమైన జీవ ప్రక్రియ. శరీరానికి పూర్తి విశ్రాంతి దొరికేది నిద్రలోనే. ఈ సమయంలోనే శరీరం శక్తి నిల్వలను నియంత్రించుకుంటుంది. సెల్ఫ్‌ రిపేర్‌ చేసుకుంటుంది.

Health: ఇంటి పని, వంట పని, పిల్లల ఆలనాపాలన.. కునుకు కరవాయే..

ఇంటి పని, వంట పని, పిల్లల ఆలనాపాలన... వీటికి తోడు ఉద్యోగం చేసే మహిళలైతే ఆఫీసు పని... వీటన్నింటిని చక్కబెట్టుకోవడంతోనే మహిళలు అలసిపోతున్నారు. ఫలితంగా కంటినిండా నిద్రపోవడం లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర అవసరం. మరుసటి రోజంతా ఉత్సాహంగా పనిచేయాలంటే రాత్రి ఎలాంటి ఆటంకం లేకుండా ఎనిమిది గంటలైనా నిద్రపోవాలి. మరి భారతీయ మహిళలు సరిపడా నిద్రపోతున్నారా? వారిని నిద్రకు దూరం చేస్తున్న అంశాలేంటి? ఈ విషయం తెలుసుకోవడానికి ఇటీవల దేశవ్యాప్తంగా ఒక అధ్యయనం నిర్వహించారు. అందులో వెల్లడైన అనేక ఆసక్తికర అంశాలే ఈ వారం కవర్‌స్టోరీ.

ఆరోగ్యంగా ఉండాలంటే... రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. ఎప్పటి నుంచో వింటున్న మాట. నిద్ర ఒక సహజ సిద్ధమైన జీవ ప్రక్రియ. శరీరానికి పూర్తి విశ్రాంతి దొరికేది నిద్రలోనే. ఈ సమయంలోనే శరీరం శక్తి నిల్వలను నియంత్రించుకుంటుంది. సెల్ఫ్‌ రిపేర్‌ చేసుకుంటుంది. జ్ఞాపకాలను రీ ఆర్గనైజ్‌ చేసుకుంటుంది. ఉదయాన్నే ఉత్సాహంగా పనిచేయాలంటే రాత్రుళ్లు శరీరానికి తగిన విశ్రాంతి అవసరం. అది నిద్రలో మాత్రమే లభిస్తుంది. కానీ భారతీయుల్లో సగం మందికి పైగా సరైన నిద్ర పోవడం లేదు. ముఖ్యంగా మహిళలు కంటి నిండా నిద్రపోవడం లేదు. ఇందుకు చాలా కారణాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళల పరిస్థితి సైతం మెరుగ్గా లేదు. ప్రస్తుతం మహిళలు పురుషులతో సమానంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


రెండు షిఫ్టుల్లో పనిచేసే భారతీయ మహిళలు ఉన్నారు. ఒక షిఫ్ట్‌ ఆఫీసులో అయితే, రెండోది ఇంట్లో. ఆఫీసు పనితో అలసిపోయి ఇంటికొచ్చిన మహిళలకు ఇంటి చాకిరీ తప్పడం లేదు. దాదాపు ప్రతీ మహిళా ఉద్యోగి పరిస్థితి ఇలాగే ఉంది. దీనివల్ల మహిళలు కంటినిండా నిద్రపోవడం లేదు. ఇంకా చెప్పాలంటే... వాళ్లకు సరిపడా నిద్రపోయేంత సమయం దొరకడం లేదు. దేశవ్యాప్తంగా ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. ‘స్లీపింగ్‌ ప్యాటర్న్స్‌’ ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు సుమారు ఐదు లక్షల మందిపై ఒక అధ్యయనం నిర్వహించారు. ఇందులో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.


book6.2.jpg

పని భారంతో...

24 గంటల్లో ఏమేం పనులు చేశారు? తినడం, నిద్రపోవడం, గార్డెనింగ్‌, పూజ, గిన్నెలు శుభ్రం చేయడం, బట్టలుతకడం... ఇలా అన్ని విషయాల గురించి అధ్యయనం చేశారు. నగరాల్లో నివసిస్తున్న నలభై ఏళ్ల పురుషులు 8 గంటలకు మించి నిద్రపోతున్నారు. అదే 30ల్లో ఉన్న మహిళలు సగటున 7.3 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లల్లో పెద్దగా తేడా ఉండటం లేదు. ఆ వయస్సు బాలబాలికల నిద్రా సమయం ఒకేలా ఉంటోంది. 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు కూడా కొంత ఫరవాలేదు. ఎప్పుడైతే 30 ఏళ్లు దాటి ఇంటి బాధ్యతలు కూడా వచ్చి చేరతాయో అప్పుడు వారు నిద్రను త్యాగం చేయాల్సి వస్తోంది.


book6.3.jpg

30 ఏళ్లు దాటిన తరువాత పురుషులతో పోలిస్తే మహిళల్లో అరగంట నిద్ర తక్కువగా ఉంటోంది. ఉదయం టీ పెట్టడంతో ప్రారంభమై, రాత్రుళ్లు డిన్నర్‌ పూర్తయ్యాక బెడ్‌రూమ్‌లో పక్క సర్దడంతో మహిళలకు ఆ రోజు పని పూర్తవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో 18 శాతం మంది మహిళలు, పట్టణ ప్రాంతాల్లో 16 శాతం మంది మహిళలకు ఈ పని తప్పడం లేదు. నిద్రపోవడానికి ముందు ఇది సాధారణ పనిగా ఉంటోంది. ఇంటి పనుల వల్ల మహిళలు అలసిపోయి సుఖవంతమైన నిద్ర పోవడం లేదు. నిజానికి హార్మోన్ల అసమతుల్యత సమస్యలు కూడా మహిళలను వేధిస్తుంటాయి. నిద్రలేమికి హార్మోన్ల సమస్యలకు సంబంధం ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. ఇన్సోమ్నియా, రెస్ట్‌లెస్‌ లెగ్స్‌ సిండ్రోమ్‌ వంటి స్లీప్‌ డిజార్డర్స్‌ వంటివి మహిళల్లో సాధారణంగా కనిపిస్తుంటాయి. ఇవి కూడా వారి నిద్రలేమికి కారణమవుతున్నాయి.


మెట్రో... లేట్‌ నైట్‌

నగరాల్లో నివసించే పిల్లల్లో 55 శాతం మంది రాత్రి 10 గంటల తరువాతే నిద్రకు ఉపక్రమిస్తున్నారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ఇది 28 శాతంగా ఉంది. అయితే యువకులు సగటున రాత్రి పదిన్నరకు నిద్రకు ఉపక్రమిస్తున్నారు. నగరాల్లో 80 శాతం మంది యువకులు రాత్రి 10 తరువాత బెడ్‌పైకి చేరితే, గ్రామీణ ప్రాంతాల్లోని యువకుల్లో 55 శాతం మంది 10 తరువాత నిద్రకు ఉపక్రమిస్తున్నారు. మెట్రో నగరాల్లో లేట్‌ నైట్‌ నిద్రపోవడం ఎక్కువగా కనిపిస్తోంది. సగటున యువకులు రాత్రి 10.47 గంటలకు, యువతులు 10.34కి నిద్రపోతున్నారు. ఇక ఉదయం యువతులు 6.51 గంటలకు నిద్రలేస్తే, యువకులు 7.14కి మేల్కొంటున్నారు. సాధారణ నగరాల్లో అయితే పావు గంట ముందుగా నిద్రలేస్తున్నట్టు సర్వేలో తేలింది.


book6.4.jpg

నిద్రను దూరం చేస్తున్న ఫోన్‌ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ రకరకాల పనులు, ఉద్యోగాలు చేసే వారిలో 84 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారిలో 66 శాతం మంది రాత్రి 9 నుంచి 11 మధ్య నిద్రకు ఉపక్రమిస్తున్నారని తేలింది. రూరల్‌ వర్కింగ్‌ మెన్‌లో 30 శాతం నిద్రపోయే ముందు ఫోన్‌ వంటివి చూస్తున్నారు. మహిళలైతే 17 శాతం మంది మాత్రమే బెడ్‌పైకి చేరాక ఫోన్‌ పట్టుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో పురుషులు 37 శాతం, స్త్రీల సంఖ్య 26 శాతంగా ఉంది. విషాదం ఏమిటంటే... చదువుకున్నవారే ఎక్కువగా బెడ్‌టైమ్‌లో ఫోన్‌ చూస్తున్నారు. చాలామంది డిన్నర్‌ పూర్తికాగానే నిద్రకు ఉపక్రమిస్తున్నారు. డిన్నర్‌కు బెడ్‌టైమ్‌కు మధ్య గ్యాప్‌ ఉండటం లేదు. దక్షిణ భారతదేశంలో నిద్రపోయే ముందు టీవీ చూడటం చాలా సాధారణ విషయంగా ఉంది.


పనికిరాని పగటి నిద్ర

గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు పురుషులతో పోలిస్తే 21 నిమిషాలు తక్కువ నిద్రపోతున్నట్టు వెల్లడయ్యింది. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 17 నిమిషాలు తక్కువ నిద్రపోతున్నట్టు తేలింది. సాధారణంగా గృహిణులు మధ్యాహ్నం కాసేపు కునుకు తీస్తారు. అయితే ఇటీవల కాలంలో బాధ్యతల వల్ల నిద్ర గురించి ఆలోచించే సమయం వారికి దొరకడం లేదు. 21వ శతాబ్దపు మహిళలు ఇంటిపని కోసం నిద్రను వదులుకుంటున్నారు. ఇక యువతులు నిద్రకు ఉపక్రమించే ముందు ఫోన్‌ చూస్తూ నిద్రను దూరం చేసుకుంటున్నారు. అంతేకాకుండా పడుకునే ముందు ఫోన్‌ చూడటం వల్ల రాత్రుళ్లు గాఢనిద్ర పోలేకపోతున్నారు.


book6.5.jpg

జబ్బులను ఆహ్వానించినట్టే...

ఒక మనిషికి ఎంత సమయం నిద్ర అవసరం? ఈ విషయంలో మనకు ఎలాంటి అధికారిక గైడ్‌లైన్స్‌ లేవు. ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం ఎలాంటి సూచనలు చేయలేదు. యూకే నేషనల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ మాత్రం తొమ్మిది గంటల నిద్ర అవసరమని రికమెండ్‌ చేసింది. కానీ భారతీయ మహిళలు సగటున ఎనిమిది గంటల నిద్ర కూడా పోవడం లేదు. ఉద్యోగం చేసి వచ్చే మహిళలు ఇంటిపని పూర్తి చేసుకునేసరికి ఆలస్యం అవుతోంది. ఫలితంగా సరైన నిద్ర ఉండటం లేదు. గృహిణులకు మధ్యాహ్నం కాసేపు నిద్రపోయే అవకాశం లభించినా అది నాణ్యమైన నిద్ర కాదంటున్నారు నిపుణులు.


రాత్రివేళ ఆటంకం లేకుండా నిద్రపోవడం ఆరోగ్యకరమైన జీవనవిధానానికి అవసరం అన్నది నిపుణుల మాట. నిద్రలేమి అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం నుంచి మధుమేహం వరకు, ఒత్తిడి నుంచి గుండెపోటు వరకు రకరకాల జబ్బులకు నిద్రలేమి కారణమవుతోంది. పైగా హైపర్‌ టెన్షన్‌, గుండెజబ్బులు, హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, ఆందోళన వంటివి వస్తాయి. వాహనాలు నడిపే వారికి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. స్లీప్‌ సర్వేలో భాగంగా 4,54,192 మందితో మాట్లాడారు. ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ వంటి నగరాల్లో సర్వే చేశారు.

- సండే డెస్క్‌


book6.6.jpg

రోజువారీ నిద్ర

తూర్పు ఈశాన్య రాష్ట్రాలతో పాటు బెంగాల్‌లో నివసించేవారు సగటున రాత్రి 9.59 గంటలకు నిద్రపోతున్నారు. ఉదయం 5.51 నిద్ర లేస్తున్నారు. పశ్చిమ ప్రాంతంతో పాటు మిగిలిన రాష్ట్రాల ప్రజలు రాత్రి 10 గంటలకు నిద్రకు ఉపక్రమించి ఉదయం 6.08 గంటలకు నిద్రలేస్తున్నారు.

15 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సుండి 8 గంటల పాటు నిద్రపోతున్న వారి శాతం రాష్ట్రాల వారీగా...

గ్రామీణ ప్రాంతాల్లో...

కర్ణాటక- 74

కేరళ - 51

ఆంధ్రప్రదేశ్‌- 74

ఒడిశా- 54

పశ్చిమ బెంగాల్‌- 55

మిజోరాం- 86

మేఘాలయ- 90

సిక్కిం- 87

బిహార్‌- 56


పట్టణ ప్రాంతాల్లో...

ఢిల్లీ - 51

కర్ణాటక - 71

తమిళనాడు - 69

ఆంధ్రప్రదేశ్‌ - 68

పశ్చిమ బెంగాల్‌- 49

మేఘాలయ - 78

బిహార్‌ - 48

ఎలా నిద్రపోతాం?

సాధారణంగా నిద్ర ‘సిర్కాడియన్‌ రిథమ్‌’ను అనుసరిస్తుంది. చీకటిపడుతున్న కొద్దీ శరీరం వెలుతురు తగ్గుతున్న విషయాన్ని గుర్తించి, నిద్రకు సహాయపడే ‘మెలటోనిన్‌’ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. నీరు తాగాలి, ఆహారం తినాలని ఎలా కోరిక ఉంటుందో అలాగే స్లీప్‌ డ్రైవ్‌ కూడా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ఒక స్థాయి దాటిన తరువాత ఆటోమేటిక్‌గా నిద్ర మత్తు ఆవహిస్తుంది.


book6.7.jpg

సగానికి పైగా అరకొర నిద్రే

గాఢ నిద్ర పోవడానికి 52 శాతం పైగా మంది స్ట్రగుల్‌ అవుతున్నారు. ‘ఏజ్‌వెల్‌ ఫౌండేషన్‌’ అనే సంస్థ 20 రాష్ట్రాల్లో 5వేల మందిపై నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. 69.8 శాతం మంది ఆరుగంటల కన్నా తక్కువ సమయం నిద్రపోతున్నట్లు ఇందులో తేలింది.

‘‘నాకు బాగా గుర్తు. నేను హాయిగా, ఎనిమిది గంటలు నిద్రపోయి రెండేళ్లవుతోంది. ఎందుకంటే ఇప్పుడు నా కూతురుకు రెండేళ్లు. తను పుట్టాక నిద్రను త్యాగం చేశాను’’ అని తన అభిప్రాయాన్ని పంచుకుంటారు వైజాగ్‌కు చెందిన సుమతి.

‘‘ఉదయం వంటచేయడం, పిల్లలను రెడీ చేయడం, అందరికీ లంచ్‌బాక్సులు కట్టడం, ఆఫీసుకు ఎక్కడ లేట్‌ అవుతుందోనని పరుగెత్తడం, సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి చేరుకోవడం, పనంతా పూర్తి చేసుకుని పడుకునే సరికి రాత్రి పది. నాకంటూ కొద్ది సమయం కూడా దొరకడం లేదు. శారీరకంగానూ, మానసికంగా అలసిపోతున్నా. హాయిగా నిద్రపోయిందే లేదు’’ అని తన రోటీన్‌ జీవితం గురించి చెప్పుకొచ్చారు మియాపూర్‌లో ఉండే ఉద్యోగిణి కల్పన.


భారతీయ మహిళల్లో సగం మంది ఎదుర్కొంటున్న అనుభవాలివి.

రోజులో 30 నిమిషాలు లేక అంతకన్నా ఎక్కువ సమయం నిద్రలేమితో బాధపడుతున్నవారి సంఖ్య (వయస్సు ఆధారంగా)...

6-14 మధ్య 1.2 శాతం

15-19 మధ్య 1.2 శాతం

20-29 మధ్య 1.4 శాతం

3--39 మధ్య 1.7 శాతం

40-49 మధ్య 2.5 శాతం

50-59 మధ్య 3.6 శాతం

60-69 మధ్య 5.7 శాతం


70 పై వయస్సున్న వారు 10.5 శాతం

15 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సున్న వారు రోజులో 30 నిమిషాలు లేక అంతకన్నా ఎక్కువ సమయం నిద్రలేమితో బాధపడుతున్న వారి శాతం (రాష్ట్రాల వారీగా)...

ఉత్తరాఖండ్‌- 13 శాతం

త్రిపుర- 8.2 శాతం

నాగాలాండ్‌- 5.3 శాతం

ఒడిశా- 4.5 శాతం

మహారాష్ట్ర - 3.4 శాతం


నిద్రాభంగం

నిద్రాభంగం కావడానికి ప్రధాన కారణం చిన్నపిల్లల అవసరాలు. చంటి పిల్లలు పాల కోసం ఏడవడం, రాత్రుళ్లు డైపర్‌ మార్చాల్సి రావడం వంటి రకరకాల కారణాలతో నిద్రాభంగం అవుతోంది. చంటి పిల్లలు ఉన్న తల్లులకు రాత్రుళ్లు కనీసం నాలుగైదుసార్లు నిద్రాభంగం అవుతున్నట్టు అధ్యయనంలో తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో నిద్రాభంగానికి గురవుతున్న పురుషులు 2.9 శాతం ఉంటే, మహిళల సంఖ్య 23.5 శాతంగా ఉంది. అదే పట్టణ ప్రాంతాల్లో పురుషులు 1.7 శాతం ఉంటే 22.5 మంది స్త్రీలు నిద్ర మేల్కోవాల్సి వస్తోంది.


ఏది మంచి నిద్ర?

‘నేషనల్‌ స్లీప్‌ ఫౌండేషన్‌’ గైడ్‌లైన్స్‌ ప్రకారం బెడ్‌పైకి చేరుకున్న 30 నిమిషాల్లో నిద్రపోవాలి. మధ్యలో మెలకువ వచ్చినా వెంటనే మళ్లీ నిద్రలోకి జారుకోగలగాలి. అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ స్లీప్‌ మెడిసిన్‌, స్లీప్‌ రీసెర్చ్‌ సొసైటీ ప్రకారం కనీసం 7 గంటలు లేదా అంతకన్నా ఎక్కువ సమయం నిద్ర అవసరం.

తప్పుదోవ పట్టించే బ్లూ లైట్‌

రాత్రుళ్లు ఫోన్‌ వల్ల వెలువడే బ్లూ లైట్‌ మెదడును తప్పుదోవ పట్టిస్తుంది. ఫలితంగా మెదడు పగటి సమయమే అనుకుని మెలటోనిన్‌ హార్మోన్‌ను ఉత్పత్తి చేయదు. దానివల్ల నిద్ర పట్టదు. ‘‘ఫోన్‌ చూస్తున్నప్పుడు మెదడు ఉత్తేజితం అయి మేల్కొని ఉండేలా చేస్తుంది. రాత్రుళ్లు నిద్రాభంగం కలగడానికి ఇది కారణమవుతుంది’’ అని రెస్పిరేటరీ అండ్‌ స్లీప్‌ మెడిసిన్‌ కన్సల్టెంట్‌ పనిచేస్తున్న డా. ఆశిష్‌కుమార్‌ అంటారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ధరలకు రెక్కలు.. నేటి ధరలు చూస్తే..

విమానంలో పగిలిన అద్దం.. 76 మందికి తప్పిన ముప్పు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 12 , 2025 | 10:46 AM