Health: క్షణాల్లో బ్లడ్ రిపోర్ట్స్.. అందుబాటులోకి హెల్త్ ఏటీఎంలు
ABN , Publish Date - Oct 01 , 2025 | 08:20 AM
పాతబస్తీకి చెందిన ఓ గర్భిణీ కింగ్‌కోఠి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. ఆమెకు అత్యవసరంగా హిమోగ్లోబిన్ పరీక్ష చేయాల్సి ఉంది. ల్యాబ్ సమయం అయిపోయింది. దీంతో ఆస్పత్రిలో ఉన్న ఏటీఎం యంత్రంపై పరీక్షలు చేసి క్షణాల్లో ఫలితాలు తెలుసుకున్నారు.
- ప్రయోగాత్మకంగా కింగ్‌కోఠి, మలక్‌పేట ఆస్పత్రుల్లో ..
- నివేదికను సిద్ధం చేసిన వైద్యులు
- ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే దవాఖానాల్లో ఏర్పాటు
హైదరాబాద్ సిటీ: పాతబస్తీకి చెందిన ఓ గర్భిణీ కింగ్‌కోఠి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. ఆమెకు అత్యవసరంగా హిమోగ్లోబిన్ పరీక్ష చేయాల్సి ఉంది. ల్యాబ్ సమయం అయిపోయింది. దీంతో ఆస్పత్రిలో ఉన్న ఏటీఎం యంత్రంపై పరీక్షలు చేసి క్షణాల్లో ఫలితాలు తెలుసుకున్నారు. గర్భిణీ నుంచి ఒక రక్తపు బొట్టు సేకరించి, దానిని స్ర్టిప్‌పై వేసి యంత్రంలో ఫిక్స్ చేశారు. హెల్త్ ఏటీఎం మానిటర్‌ఫై ఫలితాలు డిస్‌ప్లే అయ్యాయి. వాటిని బట్టి ఆమెకు చికిత్స ప్రారంభించారు.
ఐదు క్షణాల్లో..
ఒక రక్తపు బొట్టును తీసుకుని స్ట్రిప్‌పై వేసి ఏటీఎం యంత్రంలో పెడితే చాలు. 5 క్షణాల్లో హిమోగ్లోబిన్, ర్యాండమ్ బ్లడ్ షుగర్ (ఆర్బీఎస్), డయాబెటిక్, యూరిక్ యాసిడ్, కొలస్ట్రాల్ వంటి పరీక్షల ఫలితాలు వచ్చేస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. థైరాయిడ్ ఫలితాలు రావడానికి 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. హెచ్‌బీఏ1సీ ఫలితం రావడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. మొత్తంగా ఈ హెల్త్ ఏటీఎం ద్వారా దాదాపు 130కు పైగా వైద్య పరీక్షలను నిర్వహించడానికి అవకాశముందని కింగ్‌కోఠి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ బాబు తెలిపారు. అత్యవసర సమయాల్లో రోగి వ్యాధి నిర్ధారణ ఫలితాల కోసం హెల్త్ ఏటీఎంలు ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఇప్పటికే నివేదికను సిద్ధం చేశామని, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు.

వంద శాతం కచ్చితత్వం
ప్రభుత్వ జిల్లా ఆస్పత్రులు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెల్త్ ఏటీఎం యంత్రాలను అందుబాటులోకి తేవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా కింగ్‌కోఠి, మలక్‌పేటలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసి అఽధ్యయనం చేశారు. రోగులకు అక్కడికక్కడే పరీక్షలు చేసి ఫలితాలను వెంటనే ఇచ్చేశారు. 20 రోజుల పాటు రోజుకు 10 మంది చొప్పున హెల్త్ ఏటీఎంలో పరీక్షలు చేశారు. ఈ ఫలితాలను తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్ (టీడీఎస్) నివేదికలతో పోల్చి చూశారు. వంద శాతం కచ్చితత్వం ఉందని డాక్టర్ సంతోష్ బాబు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధర మరింత పెరిగింది.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
9 నెలల్లో 203 కేసులు.. 189 మంది అరెస్టు !
Read Latest Telangana News and National News