hHealth Alert : ఫ్రిజ్‌లో అన్నం ఎన్ని రోజులు నిల్వ చేయాలో తెలుసా..
ABN , Publish Date - Jan 21 , 2025 | 06:52 PM
అన్నం ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా.. అయితే, ఎన్ని రోజులు నిల్వ చేయాలి? ఎన్నిసార్లు వేడి చేసుకుని తినాలో తెలుసా ? ఇలా నిల్వ చేసిన ఆహారం తింటే ఆరోగ్యానికి చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు..
ఎంతమందికి ఎంత అన్నం వండాలనేది మనలో చాలామందికీ తెలీదు. ఒకవేళ కొలత ప్రకారమే చేసినా ఎవరో ఒకరు తినటం మానేస్తే మిగిలిపోతుంటుంది. ఇది ప్రతిఒక్కరి ఇంట్లో రోజూ జరిగేదే. కూరలు, పచ్చళ్లు లాంటివి మిగిలిపోతే ఫ్రిజ్‌లో పెట్టి తర్వాత వేడి చేసుకుని తిన్నా ఏం కాదు. కానీ, అన్నం అలా తినటం చాలా కష్టమైనా బయట పడేయలేక మరుసటి రోజైనా తినొచ్చని ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. పనిలో పడి ఆ విషయం మర్చిపోతుంటారు చాలామంది. కొన్ని రోజుల తర్వాత అకస్మాత్తుగా మిగిలిపోయిన అన్నం ఫ్రిజ్‌లో ఉంచినట్లు గుర్తొస్తుంది. తీసి చూస్తే బాగున్నట్టే కన్పించేసరికి ఈ అన్నం బాగుందా? చెడిపోయిందా? అనే ప్రశ్న తలెత్తవచ్చు. మరి, వండిన అన్నాన్ని ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు నిల్వ చేయాలి? ఎన్నిసార్లు వేడి చేసుకుని తినాలి? లేకపోతే ఏమవుతుంది అనే విషయాలు తెలుసుకుందాం..
ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారం కచ్చితంగా ఇన్ని రోజులా పాడవకుండా ఉంటుందని గ్యారెంటీగా చెప్పలేం. ఎందుకంటే, చాలామంది ఎప్పుడో ఉదయం వండిన అన్నం సాయంత్రానికి ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదు. అలా అని కాస్త వేడిగా ఉన్నప్పుడే పెట్టడమూ కరెక్ట్ కాదు. వండిన కాసేపటికి చల్లబడిందని నిర్ధారించుకున్నాకే అన్నం రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి.
అన్నం మళ్లీ వేడి చేస్తే?
చాలా సార్లు వేడి చేసిన అన్నం తర్వాత గట్టిపడుతుంది. అటువంటి పరిస్థితిలో పూర్తిగా వేడిగా అయ్యేలా చూసుకోండి. రెండుసార్లకు మించి అన్నం వేడి చేస్తే విషపూరితం అవుతుంది.
అన్నం సరిగ్గా నిల్వ చేయడానికి చిట్కాలు :
ఫ్రిజ్‌లో నిల్వ చేయడానికి ముందు అన్నాన్ని పూర్తిగా చల్లబరచండి. వేడి వేడి అన్నాన్ని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడం వల్ల తేమ పెరిగి బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది.
ఎల్లప్పుడూ అన్నం గాలి చొరబడని బాక్స్ లేదా జిప్‌లాక్ బ్యాగ్‌లో ఉంచండి. తద్వారా తేమ, గాలి ప్రవేశించలేవు.
అన్నం వండిన తర్వాత ఎంత త్వరగా ఫ్రిజ్‌లో ఉంచితే అంత మంచిది. 1-2 గంటలకు మించకుండా చూసుకోండి. నాలుగైదు రోజులకు మించితే మిగిలిన ఆహారాలు పాడయ్యే ప్రమాదముంది.
మీరు అన్నం ఎక్కువ రోజులు నిల్వ చేయాలనుకుంటే ఫ్రీజర్‌లో ఉంచండి. ఇందులో 8 నెలల వరకూ నిల్వ ఉంటుంది. నిల్వ చేసిన ఆహారం మంచిది కాదనే విషయం మర్చిపోకండి.