Rahul vs BJP: ఓట్ల కోసం ఆయన డ్యాన్స్ కూడా చేస్తారు... రాహుల్ వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ
ABN , Publish Date - Oct 29 , 2025 | 04:39 PM
మహాగట్‌బంధన్ తరఫున ముజఫర్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, అధికార బీజేపీ ఎన్నికల చోరీకి పాల్పడుతోందని విమర్శించారు. ఓటర్ అవకతవకలు, ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ఎన్నికల కమిషన్‌తో బీజేపీ కుమ్మక్కయిందని ఆరోపించారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బుధవారం శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 'ఓట్ల కోసం ఆయన ఏదైనా చేస్తారు' అంటూ విమర్శలు గుప్పించారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ వెంటనే స్పందించింది. స్థానిక గుండాలా రాహుల్ మాట్లాడుతున్నారంటూ మండిపడింది.
'మహాగట్‌బంధన్' తరఫున ముజఫర్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, అధికార బీజేపీ ఎన్నికల చోరీకి పాల్పడుతోందని విమర్శించారు. ఓటరు కార్డుల అవకతవకలు, ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ఎన్నికల కమిషన్‌తో బీజేపీ కుమ్మక్కయిందని ఆరోపించారు. 'ఆయనకు (మోదీ) మీ ఓట్లు మాత్రమే కావాలి. మీ ఓట్లకు బదులుగా ఆయనను డాన్స్ చేయమని చెబితే, ఆయన వెంటనే డాన్స్ చేస్తారు. వాళ్లు మహారాష్ట్రలో ఎన్నికల చోరీకి పాల్పడ్డారు. హర్యానాలోనూ ఇదే పని చేశారు. ఇప్పుడు బీహార్‌లో ఎన్నికల చోరీకి ప్రయత్నిస్తున్నారు' అని రాహుల్ అన్నారు.
ఢిల్లీలో కాలుష్యంతో నిండిన యమునా నది ఒడ్డున ప్రత్యేకంగా ఒక చెరువు నిర్మించినట్టు వస్తున్న వార్తలపైనా రాహుల్ స్పందించారు. 'అక్కడ యమున లేదు. చెరువు మాత్రమే ఉంది. ఫిల్టర్ వాటర్ నింపారు. ప్రధానమంత్రి తన స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేయడానికి వెళ్లారు. సామాన్య ప్రజానీకం మాత్రం యమునా నది మురికి జలాల్లో ఛాత్ ప్రార్థనలు చేస్తున్నారు. ఆయనకు యుమునా నదితో సంబంధం లేదు. ఛత్ పూజతో సంబంధం లేదు. ఆయనకు మీ ఓటు మాత్రమే కావాలి' అని రాహుల్ వ్యంగ్యోక్తులు గుప్పించారు.
ఓటర్లను అవమానిస్తారా.. బీజేపీ ఫైర్
ప్రధానికి ఓట్లే ముఖ్యమని, ప్రజలు కోరితే డాన్స్ చేయడానికి కూడా ఆయన వెనుకాడరని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. స్థానిక గూండాలా రాహుల్ మాట్లాడుతున్నారని, ఇది ప్రధానికి ఓటేసిన ప్రతి ఒక్కరినీ అవమానించడమేనని పేర్కొంది. దేశంలోని ఓటర్లు, ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని తెలిపింది. రాహుల్ గాంధీ బహిరంగంగానే చొరబాటుదారులకు బాసటగా నిలుస్తున్నారని ప్రతి విమర్శలు చేసింది
ఇవి కూడా చదవండి..
భారత్ - చైనా చర్చలు.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి
తేల్చి చెప్పిన డిప్యూటీ సీఎం.. నీ సలహాతో ప్రాజెక్టు ఆపలేం...
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి