Bihar Elections: అమిత్‌షా రహస్య సమావేశాలు.. కాంగ్రెస్ సంచలన ఆరోపణ
ABN , Publish Date - Nov 08 , 2025 | 05:25 PM
తొలి దశ పోలింగ్‌లో వచ్చిన స్పందన తమకు సానుకూలంగా లేకపోవడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలను కుదించుకున్నారని తెలిసిందని పవన్‌ఖేరా చెప్పారు. పోలింగ్ జరిగిన 121 నియోజకవర్గాల్లో చాలాచోట్ల మహాగఠ్‌బంధన్ ముందంజలో ఉందన్నారు.
పాట్నా: బిహార్ ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah)పై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేర (Pawan Khera) సంచలన ఆరోపణలు చేశారు. అమిత్‌షా తన పర్యటనల్లో అధికారులతో రహస్య సమావేశాలు జరుపుతున్నారని, ఎలివేటర్స్‌లోని సీసీటీవీ కెమెరాలను పేపర్‌తో సీల్ చేస్తున్నారని శనివారంనాడిక్కడ మీడియా సమావేశంలో తెలిపారు.
'హోం మంత్రి ఎప్పుడు పాట్నా వచ్చినా హోటల్ ఎలివేటర్లలోని సీసీటీవీ (కెమెరాలు)పై పేపర్లు అంటిస్తున్నారు. అధికారులతో ఆయన రహస్య మంతనాలు సాగిస్తున్నారు. అంత రహస్యంగా మీరు జరుపుతున్న సమావేశాలు ఏమిటి?' అని అమిత్‌షాను ఆయన ప్రశ్నించారు.
ర్యాలీలు కుదించుకున్న పీఎం
తొలి దశ పోలింగ్‌లో వచ్చిన స్పందన తమకు సానుకూలంగా లేకపోవడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలను కుదించుకున్నట్టు తెలిసిందని పవన్‌ఖేరా చెప్పారు. పోలింగ్ జరిగిన 121 నియోజకవర్గాల్లో చాలాచోట్ల మహాగఠ్‌బంధన్ ముందంజలో ఉందని, 72 సీట్లలో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఫైనల్ ఓటింగ్ శాతం
కాగా, ఈనెల 6న జరిగిన తొలి విడత పోలింగ్ శాతాన్ని ఎన్నికల కమిషన్ శనివారంనాడు ప్రకటించింది. 65.08 శాతం పోలింగ్ జరిగినట్టు తెలిపింది. కాగా తుది (రెండో) విడత పోలింగ్ నవంబర్ 11న 122 నియోజకవర్గాల్లో జరుగనుంది. దీంతో పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి
డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
వారణాసిలో మోదీ పర్యటన.. నాలుగు వందేభారత్ రైళ్లు ప్రారంభం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి