Mukesh Sahani life Story: సేల్స్‌మ్యాన్ నుంచి డిప్యూటీ సీఎం అభ్యర్థిగా సహాని?
ABN , Publish Date - Oct 23 , 2025 | 08:06 PM
త్వరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై మల్లగుల్లాలు పడిన విపక్ష ఇండియా కూటమి ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చింది. సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థులను ప్రకటించింది. సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ను విపక్ష ఇండి కూటమి ప్రకటించింది.
బిహార్, అక్టోబర్ 23: ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ఉంటుంది. అయితే కొందరు మాత్రమే తమ టార్గెట్ దిశగా అడుగులు వేస్తారు. అలా ఎంతోమంది అత్యంత సామాన్యు స్థితి నుంచి ప్రపంచమే గుర్తించే స్థితి చేరుకున్నారు. అలాంటి వారిలో ఒకరే ముకేశ్ సహాని. రాజకీయాల్లోకి రావాలని భావించే యువతకు సహనీ లైఫ్ ఓ స్ఫూర్తి. సేల్స్ మ్యాన్ నుంచి ప్రస్తుతం డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ఎంపికయ్యారు. అసలు ఈయన ఎవరు?, ఎక్కడ డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ముకేశ్ సహాని ఉన్నారు? అనే సందేహాలు మీకు రావచ్చు. సహనీకి సంబంధించిన పూర్తి స్టోరీని ఇప్పుడు చూద్దాం.
త్వరలో బిహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై మల్లగుల్లాలు పడిన విపక్ష ఇండియా కూటమి ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చింది. సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థులనూ ప్రకటించింది. సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ను విపక్ష ఇండి కూటమి ప్రకటించింది. ఈ క్రమంలో వెనుకబడిన వర్గానికి చెందిన ముకేశ్ సహానిని(Mukesh Sahni) డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఆ సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఈయన వికాస్‌శీల్ ఇన్‌సాన్ పార్టీ (VIP) వ్యవస్థాపకుడు. కొన్నేళ్ల క్రితం నుంచి రాష్ట్ర రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నాడు.
సహనీ బ్యాగ్రౌండ్ ఇదే..
బిహార్, దర్భంగా ప్రాంతంలో సుపాల్ బజార్ అనే గ్రామంలోని ఓ మత్స్యకారుల కుటుంబంలో 1981లో ముకేశ్ సహాని జన్మించారు. అతను19 ఏళ్ల వయసులో 1999లో తన స్నేహితుడితో కలిసి ఇంటి నుండి ముంబైకి వెళ్లాడు. అక్కడ సేల్స్ మ్యాన్ గా ఓ దుకాణంలో ఉద్యోగం చేశాడు. కొంతకాలం తర్వాత తండ్రి కోసం తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. అయితే ముంబైలో తనకు ఉన్న స్వేచ్ఛ సొంత ఊర్లో లేకపోవడంతో తిరిగి అక్కడికి వెళ్లాడు. ఈ సారి స్టేజ్ డిజైనర్‌గా బాలీవుడ్‌లో సహనీ అడుగుపెట్టారు. ముకేశ్ 'సినీ వరల్డ్' పేరుతో ఓ చిన్న కంపెనీని స్థాపించి సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు. నిషాద్ వర్గానికి చెందిన ఈయన.. పట్నా, దర్భంగాలలో పలు సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి తన సామాజిక వర్గం ‘మల్లా కుమారుడు’ (Son of Mallah)గా గుర్తింపు పొందాడు. మల్లా అనేది నిషాద్ వర్గంలో ఉప కులంగా ఉంది. రాష్ట్రంలో నిషాద్‌ల జనాభా 9.6శాతంగా ఉండగా, సహానికి చెందిన మల్లాలు 2.6శాతంగా స్థానిక నివేదికలు తెలిపాయి.
ప్రధాని మోదీ చొరవతో 2015 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసిన సహాని.. తదనంతరం నిషాద్ వర్గ నాయకుడిగా ఎదిగారు. అయితే తర్వాత వివిధ కారణాలతో సహాని బీజేపీకి దూరమయ్యారు. 2018లో వికాస్‌శీల్ ఇన్‌సాన్ పార్టీ (VIP)ని స్థాపించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్‌లో చేరి పోటీ చేసినప్పటికీ ఖాతా తెరవలేదు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఎన్డీయే కూటమి తరఫున పోటీ చేయగా.. వీఐపీ తరఫున నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్నికల్లో ఓడిపోయిన సహానికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన బీజేపీ.. పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి పదవి అప్పగించింది.
2022లో సహనీ ఎమ్మెల్సీ పదవి కూడా ముగియడం, మరోసారి బీజేపీ అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన మంత్రి పదవికి దూరమయ్యారు. దీంతో విపక్ష కూటమిలో చేరారు. మహాగఠ్‌బంధన్‌లో ప్రధాన పార్టీలుగా ఉన్న ఆర్జేడీ(RJA), కాంగ్రెస్(Congress), కమ్యూనిస్టు పార్టీ (ఎంఎల్)లు సీట్ల పంపకాల కోసం కుస్తీ పడ్డాయి. ఈ నేపథ్యంలో నిషాద్ వర్గానికి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నించిన విపక్ష కూటమి.. వీఐపీని తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో గెలిస్తే.. డిప్యూటీ సీఎంగా సహానిని(Son of Mallah) చేస్తామని హామీ ఇవ్వడం ద్వారా నిషాద్ వర్గం తమకు మద్దతుగా నిలుస్తారని విపక్ష ఇండియా కూటమి ఆశిస్తోంది. ఏది ఏకమైనప్పటికీ ప్రధాన పార్టీలకు ముకేశ్ సహాని ఓ కీలక వ్యక్తిగా మారాడు. అంతేకాక తన కృషి పట్టుదలతో సేల్స్ మ్యాన్ స్థాయి నుంచి డిప్యూటీ సీఎం అభ్యర్థిగా నిలబడే స్థాయికి సహాని చేరుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
Tejashwi Yadav: డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో రాష్ట్రంలో అవినీతి: తేజస్వి యాదవ్
MNM leader Snehan: అసెంబ్లీ ఎన్నికలు.. భీకర యుద్ధమే