Share News

Bihar Elections: నితీష్ రిమోట్ కంట్రోల్ బీజేపీ చేతుల్లో ఉంది: రాహుల్

ABN , Publish Date - Oct 29 , 2025 | 03:37 PM

బిహార్‌లో సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం లేవని, కేవలం ముగ్గురు నలుగురు బీజేపీ నేతలు రిమోట్ కంట్రోల్‌ను తమ చేతుల్లో పెట్టుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Bihar Elections: నితీష్ రిమోట్ కంట్రోల్ బీజేపీ చేతుల్లో ఉంది: రాహుల్
Rahul gandhi in Muzaffarpur

ముజఫర్‌పూర్: బిహార్‌కు రెండు నెలలుగా ముఖం చూపించడం లేదంటూ తనపై బీజేపీ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌‌ ఫేస్ చూపిస్తూ రిమోట్ కంట్రోల్ మాత్రం బీజేపీ తమ చేతుల్లో పెట్టుకుందని, సామాజిక న్యాయానికి పాతరేసిందని విమర్శించారు. ముజఫర్‌పూర్‌ (Muzaffarpur)లో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ, నితీష్ నాయకత్వం అంటూ బయటకు చూపిస్తూ అసలైన పవర్ అంతా తమ చేతుల్లోనే బీజేపీ పెట్టుకుందని, ఆయన ఫేస్ వాడుకుంటూ రిమోట్ తమ చేతుల్లో పెట్టుకుందని అన్నారు.


సామాజిక న్యాయానికి బీజేపీ వ్యతిరేకం

బిహార్‌లో సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం లేవని, కేవలం ముగ్గురు నలుగురు బీజేపీ నేతలు రిమోట్ కంట్రోల్‌ను తమ చేతుల్లో పెట్టుకున్నారని రాహుల్ ఆరోపించారు. దీనిని దృష్టిలో ఉంచుకునే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని తాను పార్లమెంటులో డిమాండ్ చేశానని చెప్పారు. ఇదే మాట లోక్‌సభలో ప్రధానమంత్రికి నేరుగా సూచించానని, అయితే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. సామాజిక న్యాయానికి బీజేపీ పూర్తిగా వ్యతిరేకమని, దాన్ని వాళ్లు కోరుకోవడం లేదని తప్పుపట్టారు.


నితీష్ కుమార్ రెండు దశాబ్దాల పాలనలో బిహార్ ప్రజలు ఎలాంటి ప్రగతికి నోచుకోలేదని రాహుల్ విమర్శించారు. 'బిహార్‌లో సొంత ప్రజలకే భవిష్యత్తు లేదు. ఇది నిజం' అని అన్నారు. తాను బాగా వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినని నితీష్ తరచు చెబుతుంటారని, అయితే ప్రజలకు కనీస అవసరాలు అందించడంలో సైతం ఆయన విఫలమయ్యారని ఆరోపించారు. విద్య, ఆరోగ్యం. ఉపాధి విషయంలో నితీష్ గత 20 ఏళ్లలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. 'మీ కోసం ఏమి చేయని బిహార్ అవసరమా? అలాంటి బిహార్ మనకు అవసరం లేదు. ఆరోగ్యం, విద్య, ఉపాధి పుష్కలంగా ఉండే బిహార్ మనకు కావాలి' అని అన్నారు. కాగా, 243 మంది సభ్యుల బిహార్ అసెంబ్లీకి నవంబర్ 6,11 తేదీల్లో ఎన్నికలు జరుగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

తేల్చి చెప్పిన డీసీఎం.. నీ సలహాతో ప్రాజెక్టు ఆపలేం...

కొత్త టోపీలు సూచించింది నేనే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 29 , 2025 | 03:40 PM