Share News

Bihar Elections: 160 సీట్లకు పైగా గెలుస్తాం.. అమిత్‌షా స్పష్టీకరణ

ABN , Publish Date - Nov 04 , 2025 | 03:06 PM

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయడం కాంగ్రెస్‌ నేతలకు పరిపాటిగా మారిందని అమిత్‌షా అన్నారు. ఇలా చేసిన ప్రతిసారి బీజేపీకి ప్రజలు ఘనవిజయం కట్టబెట్టారని, ఈసారి కూడా అదే జరుగుతుందని, కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదని అన్నారు.

Bihar Elections: 160 సీట్లకు పైగా గెలుస్తాం.. అమిత్‌షా స్పష్టీకరణ
Amit shah

దర్బంగా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) ఘనవిజయం సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) ధీమా వ్యక్తం చేశారు. అధికార ఎన్డీయే 160కి పైగా సీట్లలో గెలుస్తుందని, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో తుదుపరి ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. ఇక్కడ నితీష్ కుమార్ సీఎం అని, అక్కడ నరేంద్ర మోదీ ప్రధాని అని, సీఎం సీటు కానీ పీఎం సీటు కానీ ఖాళీగా లేదని మంగళవారంనాడు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో అమిత్‌షా తెలిపారు.


బిహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వ్యక్తిగత దాడికి పాల్పడుతున్నారని అమిత్‌షా విమర్శించారు. ఓట్ల కోసం మోదీ భరతనాట్యం చేయడానికి కూడా సిద్ధమేనని రాహుల్ మాట్లాడటం, పెళ్లి వేడుకలకు మోదీ ప్రచారం చేస్తున్నట్టు ఉందంటూ ఖర్గే వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ నిరాశానిస్పృలతో ఉందనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రజలకు చేరువకాలేదని, మోదీ కూడా అలాగే ఉండాలని కాంగ్రెస్‌ భావిస్తోందని అన్నారు. మోదీ ఎందుకు ప్రచారం చేయకూడదని ప్రశ్నించారు. ఎన్నికలంటేనే ప్రజాస్వామ్య పండుగ అని, ప్రజలకు చేరువకావడం నాయకుడి కర్తవ్యమని చెప్పారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయడం కాంగ్రెస్‌ నేతలకు పరిపాటిగా మారిందని, ఇలా చేసిన ప్రతిసారి బీజేపీకి ప్రజలు ఘనవిజయం కట్టబెట్టారని, ఈసారి కూడా అదే జరుగుతుందని, కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదని అన్నారు.


ఎస్ఐఆర్‌పై...

ఎస్ఐఆర్ ఒక్క ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోనే జరగడం లేదని, దశలవారిగా జరుగుతోందని అమిత్‌షా అన్నారు. 1955 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ 11 సార్లు జరిగిందని చెప్పారు. బిహార్ ఓటర్ల జాబితాలో 65 లక్షల మంది ఓటర్లను తొలగించడంపై అడిగినప్పుడు, అనర్హులను ఈసీ గుర్తిస్తుందని, తాము కాదని చెప్పారు. 18 ఏళ్లు, ఆపైబడిన ఓటర్లను మాత్రమే నమోదు చేయడం ఈసీ బాధ్యత అని అన్నారు.


సంక్షేమ పథకాలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చేపడుతున్నారనే విమర్శలపై స్పందిస్తూ, కుల, మత ప్రసక్తి లేకుండా సమాజంలోని అన్ని వర్గాల సాధికారతకు ఎన్డీయే కట్టుబడి ఉందని చెప్పారు. మహిళలు, యువకులు, రైతులు కుల ఫార్ములాలోకి రారని, అది సామాజిక ఫార్ములా అని అన్నారు. దళితులు, వెనుకబడిన తరగతుల వారు, రైతులు, పేద ముస్లింలు కూడా ఇందువల్ల లబ్ధి పొందుతున్నారని, కులమనేది ప్రాతిపదిక కాదని, సమ్మిళిత జాతీయాభివృద్ధి ప్రాతిపదిక అని వివరించారు.


ఇవి కూడా చదవండి..

సినిమాల్లో సామాజిక స్పృహ కొరవడింది..

రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 04 , 2025 | 03:10 PM