Election Commission of India: 9 రాష్ట్రాలు, 3 యూటీల్లో నేటి నుంచే సర్
ABN , Publish Date - Nov 04 , 2025 | 04:41 AM
దేశవ్యాప్తంగా ఓటరు సమగ్ర సవరణ(సర్) ప్రక్రియకు భారత ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం నుంచి శ్రీకారం చుట్టనుంది...
న్యూఢిల్లీ/చెన్నై, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఓటరు సమగ్ర సవరణ(సర్) ప్రక్రియకు భారత ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం నుంచి శ్రీకారం చుట్టనుంది. 9 రాష్ట్రాలు, 3యూటీల్లో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఏడో తేదీ వరకు కొనసాగే ఈ ప్రక్రియలో 51 కోట్ల మంది ఓటర్లు పాలుపంచుకోనున్నారు. ఈ రెండో దశ ‘సర్’ ప్రక్రియ కిందకు వచ్చే యూటీలు, రాష్ట్రాలు ఏవనేది ఈసీ వర్గాలు వెల్లడించాయి. అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్, పాండిచ్చేరి యూటీ జాబితాలో, ఛత్తీ్‌సగఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లు రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి. సర్ ప్రక్రియ అనేక దశల్లో కొనసాగనుంది. ఎన్యుమరేషన్ ప్రక్రియ మంగళవారం మొదలై డిసెంబరు 4వ తేదీ వరకు కొనసాగుతుంది. అనంతరం ముసాయిదా ఓటరు జాబితాను డిసెంబరు 9వ తేదీన, తుది జాబితాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈసీ విడుదల చేస్తుంది. స్వాతంత్య్ర భారతంలో ‘సర్’ ప్రక్రియను ఈసీ చేపట్టడం ఇది తొమ్మిదోసారి. చివరిగా 2002-04 మధ్య చేపట్టింది. మరోవైపు, తమిళనాడులో ‘సర్’ ప్రక్రియను అడ్డుకోవాలంటూ అధికార డీఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆ పార్టీ వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్ భారతి సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమిళనాట ఆరుమాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పరిస్థితుల్లో అత్యవసరంగా సర్ ప్రక్రియను చేపట్టడం ప్రజాప్రాతినిఽధ్య చట్టానికి వ్యతిరేకమని ఆ పిటిషన్‌లో భారతి తెలిపారు.
పారదర్శకంగా ‘సర్’: ఈసీ
‘సర్’ ప్రక్రియను పారదర్శకంగా చేపడతామని, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఈసీ మద్రాస్ హైకోర్టుకు నివేదించింది. మృతులు, నివాసం మారినవారు, అర్హతలేనివారు, రెండు ప్రాంతాల్లో ఓటుహక్కు కలిగిన వారి పేర్లను తొలగించేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలంటూ టీ నగర్‌కు చెందిన అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, తాంబరం అన్నాడీఎంకే న్యాయవాది వినాయగం వేర్వేరుగా దాఖలు చేసిన పిల్‌పై ఇటీవల విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈసీని వివరణ అడిగిన విషయం తెలిసిందే. భారత ఎన్నికలసంఘం తరఫున స్టాండింగ్ కౌన్సిల్ నిరంజన్ రాజగోపాలన్ హాజరయి దీనిపై వివరణ ఇచ్చారు.