Stock Market Opens Gains: స్టాక్ మార్కెట్‌లో గర్జన..1095 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్, కారణాలివే..
ABN , Publish Date - Aug 18 , 2025 | 09:44 AM
ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఈరోజు మరోసారి భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం ప్రారంభం నుంచే మద్దతు పలికిన గ్లోబల్ సూచనలు, దేశీయ ఆర్థిక విధానాల్లో భరోసా కలిగించే మార్పులు మార్కెట్ మూడ్‌ను మరింత పెంచేశాయి.
ఈరోజు (ఆగస్టు 18న) భారత స్టాక్ మార్కెట్ ఉత్సాహంగా దూసుకెళ్తుంది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. రష్యా నుంచి ఆయిల్ సరఫరా ఆందోళనలు తగ్గడం, అలాగే న్యూ ఢిల్లీలో ప్రతిపాదిత జీఎస్టీ సంస్కరణలపై ఆశావాదం ఈ ర్యాలీకి ఊపునిచ్చాయి. దీంతో ఈ ఉదయం మార్కెట్ ఓపెన్ అయిన కాసేపటికే సెన్సెక్స్ 304 పాయింట్లు (0.38%) ఎగసి 80,565 వద్ద, నిఫ్టీ 50 రాకెట్‌లా 132 పాయింట్లు (0.54%) పెరిగి 24,619 ఇంకా పాజిటివ్ దిశగా కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలోనే ఉదయం 9.38 గంటల నాటికి సెన్సెక్స్ 1095 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 355, బ్యాంక్ నిఫ్టీ 711, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 630 పాయింట్లు లాభపడ్డాయి. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను దక్కించుకున్నారు.
సెక్టార్లలో హవా
సెక్టోరియల్ ఇండెక్స్‌ల విషయానికొస్తే, ఫార్మా, హెల్త్‌కేర్ సెక్టార్లు మినహా మిగతా అన్ని గ్రీన్ జోన్‌లో ట్రేడ్ అవుతున్నాయి. ఆటో స్టాక్స్ 1.1% లాభంతో దూసుకెళ్లగా, ఫైనాన్షియల్ స్టాక్స్ 0.4% పెరిగాయి. బ్రాడర్ మార్కెట్‌లో నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 1.02%, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.85% లాభపడ్డాయి. ఈ లాభాలు చూస్తే చిన్న, మధ్య తరగతి కంపెనీలు కూడా మంచి జోష్‌లో ఉన్నాయని అర్థమవుతోంది. సెన్సెక్స్‌లో లార్సెన్ అండ్ టుబ్రో, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, సన్ ఫార్మా మినహా దాదాపు అన్ని స్టాక్స్ గ్రీన్‌లోనే ట్రేడ్ అవుతున్నాయి.
అప్‌గ్రేడ్ గుడ్ న్యూస్
భారత ఆర్థిక వ్యవస్థ విషయంలో ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ భారత్‌కు లాంగ్ టర్మ్ సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను BBB- నుంచి BBBకి, షార్ట్-టర్మ్ రేటింగ్‌ను A-3 నుంచి A-2కి అప్‌గ్రేడ్ చేసింది. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందిస్తూ ఈ అప్‌గ్రేడ్ భారత ప్రభుత్వం సమర్థవంతమైన ఆర్థిక విధానాలను ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ఆర్థిక నిపుణులు కూడా ఈ రేటింగ్ అప్‌గ్రేడ్‌ను స్వాగతిస్తూ, దీని వెనుక జాగ్రత్తగా రూపొందించిన ఆర్థిక విధానాల ప్రభావం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇన్వెస్టర్లకు అలర్ట్..
ఈ రోజు మార్కెట్ ట్రెండ్ చూస్తే ఇన్వెస్టర్లకు ఆశావాదం కనిపిస్తోంది. రష్యా-యూఎస్ చర్చలు, జీఎస్టీ సంస్కరణలపై సానుకూల వార్తలు మార్కెట్‌ను బూస్ట్ చేశాయి. కానీ ఫార్మా, హెల్త్‌కేర్ సెక్టార్లు కాస్త వెనుకబడినందున, ఈ సెక్టార్లలో ఇన్వెస్ట్ చేసే వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ కూడా మంచి గ్రోత్ చూపిస్తున్నాయి. కాబట్టి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు వీటిపై ఓ కన్నేయొచ్చు.
ఇవి కూడా చదవండి
డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి