Women Free Bus Service: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆలయాల సందర్శనకు కొత్త ఊరట
ABN , Publish Date - Sep 14 , 2025 | 08:17 AM
స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఏపీ వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్నిఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించారు. ఈ పథకం అన్ని తరగతులవారికి ఎంతో వెసులుబాటు కల్పిస్తుంది. ఈ పథకాన్ని వినియోగించుకుని మహిళలు ఎన్నో ఆధ్యాత్మిక ప్రాంతాలను చుట్టేస్తున్నారు.
ఫ్రీ బస్సు..జోష్
ఉచిత బస్సు ప్రయాణాలు..
పోటెత్తుతున్న
పుణ్యక్షేత్రాలు
ద్వారకాతిరుమల, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): గతంలో కుటుంబంతో సహా తీర్థయాత్రలకు వెళ్లేందుకు బస్సు ఎక్కాలంటే మధ్యతరగతి వారు జేబునిండా డబ్బు చూసుకోవాల్సి వచ్చేది. షాక్ కొట్టే బస్సు చార్జీలతో పాటు అక్కడి సాధారణ ఖర్చులు అన్నీ వారికి తడిపి మోపెడయ్యేవి. ఈమేరకు ఎక్కడికైనా వెళ్లేందుకు కాస్త ఆలోచించేవారు.. ఎంతో ముఖ్యమైతేనే కుటుంబంతో పాటు బయటకు కదిలేవారు. ఇక సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం మొదలు పెట్టడంతో మహిళల దశ తిరిగిందని చెప్పొచ్చు.
దీనిలో భాగంగా స్త్రీ శక్తి పేరుతో మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని (Women Free Bus Service) ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించారు. ఈ పథకం అన్ని తరగతులవారికి ఎంతో వెసులుబాటు కల్పిస్తుంది. ఈ పథకాన్ని వినియోగించుకుని మహిళలు ఎన్నో ఆధ్యాత్మిక ప్రాంతాలను చుట్టేస్తున్నారు. తమ కుటుంబసభ్యులతోనో, స్నేహితులతోనో, పక్క ఇంటి వారితోనో కలిసి పలు ప్రముఖ దేవాలయాలను ఉత్సాహంగా చుట్టేస్తున్నారు. దైవదర్శనం చేసుకుని సేదతీరుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్లే ఇదంతా జరుగుతోందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖ క్షేత్రాల సందర్శన..
ఉచిత బస్సు ప్రయాణాల కారణంగా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలైన ద్వారకాతిరుమల, విజయవాడ, అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి వంటి క్షేత్రాల్లో మహిళల రద్దీ కనిపిస్తోంది. దూరంగా ఉన్న ఆలయాలతో పాటు వారికి దగ్గరలోని ఆలయాలను సైతం దర్శిస్తూ ఎంత హాయిలే ఇలా అంటూ జోష్‌తో వెళుతున్నారు.
ఈ క్రమంలో ఉభయగోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల, మద్దిక్షేత్రం, వాడపల్లి, భీమవరం మావుళ్లమ్మ, పంచారామక్షేత్రాలు, పారిజాతగిరి, అప్పన్నపల్లి, వంటి ఆలయా ల్లోని దేవేరులను దర్శించుకుని మొక్కుబ డులు తీర్చుకుంటున్నారు. ద్వారకాతిరు మలలో దైవదర్శనం అనంతరం ఉచిత భోజన, ప్రసాద సౌకర్యంతో ఆ ప్రాంగణంలో మహిళలతో పోటెత్తుతున్నాయి. బస్సులు సైతం అఽధిక శాతం మంది మహిళలతోనే నిండిపోతున్నాయి. ఆక్యుపెన్సీ పెరిగిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. త్వరలోనే మరిన్ని కొత్త బస్సులు వస్తాయని.. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని వారు వివరిస్తున్నారు.
మార్మోగిన గోవింద నామస్మరణ
శ్రీనివాసా గోవిందా.. శ్రీవేంకటేశా గోవిందా.. అంటూ గోవిందనామాలతో శ్రీవారి క్షేత్రం శనివారం మార్మో గింది. రెండో శనివారం సెలవు రోజు కావడం, అందులోనూ స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయానికి ఉదయం నుంచి భక్తులు వచ్చారు. దాదాపు 20వేల మంది వరకు భక్తులు వచ్చి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వామి దర్శన అనంతరం నిత్యాన్నదాన సదనంలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఫ్రీ బస్సు ప్రయాణం బాగుంది..
ఇంట్లో అందరం బయలుదేరినా బస్సు ప్రయాణంలో రూపాయి ఖర్చు కాలేదు. గుంటూరు నుంచి వచ్చి దైవదర్శనం చేసుకున్నాం. బస్సులు రద్దీగా ఉన్నా ప్రయాణం సాఫీగానేసాగింది. ఆలయాలను దర్శిస్తున్నాం. ప్రభుత్వం పెట్టిన ఈ పథకం ఎంతో ఊరటగా ఉంది.
- చింతలపల్లి మంగమ్మ భక్తురాలు
గుంటూరు. చాన్నాళ్ల మొక్కు.. ఇప్పుడు తీరింది..
ద్వారకా తిరుమల ఆలయానికి వద్దామన్న మొక్కు ఇప్పటిది కాదు. కొన్ని సంవత్సరాల నుంచి వెళదామనుకున్నాం. కానీ కుదరలేదు. ఇప్పుడు ఫ్రీబస్సు ప్రయాణంతో కలిసివచ్చింది. కుటుంబంతో సహా ఇక్కడకు వచ్చాం. మొక్కులు తీర్చుకున్నాం ఆనందంగా ఉంది.
- లింగం నాగలక్ష్మి.. గృహిణి, విజయవాడ
ఈ వార్తలు కూడా చదవండి
ఏపీలో అమానుషం.. బీ ఫార్మసీ విద్యార్థిని దారుణ హత్య
ఆయేషా మీరా తల్లిదండ్రులకు సీబీఐ నోటీసులు
Read Latest Andhra Pradesh News and National News