CM Chandrababu: పింఛన్ల పంపిణీలో ఏపీదే అగ్రస్థానం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Dec 01 , 2025 | 02:43 PM
తమ ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీకి ఏడాదికి రూ.33వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో వందమందిలో పదమూడు మందికి పెన్షన్లు ఇస్తున్నామని.. వారిలో 59శాతం మంది మహిళలే ఉన్నారని వివరించారు.
ఏలూరు,డిసెంబరు1 (ఆంధ్రజ్యోతి): సూపర్ సిక్స్ పథకాలను సక్సెస్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. పింఛన్లకు ఏపీ కంటే ఏ రాష్ట్రం కూడా ఎక్కువ ఖర్చుపెట్టడం లేదని తెలిపారు. ఇవాళ(సోమవారం) ఏలూరు జిల్లాలోని గోపీనాథపట్నంలో చంద్రబాబు పర్యటించారు. మహిళ నాగలక్ష్మికి పెన్షన్ అందజేశారు. నల్లమాడులో స్టాళ్లను సీఎం, మంత్రులు పరిశీలించారు. అనంతరం ప్రసంగించారు. తాను, తన మిత్రుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఒకే విధంగా ఆలోచిస్తామని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.
అప్పులు ఉన్నాయి..
తమ ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీకి ఏడాదికి రూ.33వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో వందమందిలో పదమూడు మందికి పెన్షన్లు ఇస్తున్నామని.. వారిలో 59శాతం మంది మహిళలే ఉన్నారని వివరించారు. ఏపీ ప్రభుత్వానికి కష్టాలు, అప్పులు ఉన్నాయని, ఆదాయం లేదని.. అయినా ఒకేసారి రూ.4వేలకు పింఛన్లు పెంచామని తెలిపారు. గత జగన్ ప్రభుత్వం ముక్కుతూ, మూలుగుతూ రూ. 250ల చొప్పున పెంచిందని విమర్శించారు. జనాభాను పెంచాల్సిన అవసరం ఉందని.. లేకపోతే మిషన్లతో పనిచేయించాల్సి ఉంటుందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.
గత వైసీపీ ప్రభుత్వం రైతులకు రూ.1650 కోట్లు బకాయిలు పెట్టిందని మండిపడ్డారు. ఆ బకాయిలను తీర్చడమే కాదని, ఇప్పుడు కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా నాలుగు గంటల్లో పైసలు ఇస్తున్నామని వివరించారు. 25 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకున్నారని గుర్తుచేశారు. ఇప్పటి వరకు రూ.550 కోట్లు ఉచిత బస్సు పథకానికి ఖర్చు చేశామని వెల్లడించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.
పోలవరం పూర్తయితే ఏపీకి నీళ్లు వస్తాయి..
‘గోదావరి జిల్లాలు పారిశ్రామికంగానూ అభివృద్ధి చెందాలి. పోలవరం పూర్తయితే ఏపీకి నీళ్లు వస్తాయి. విశాఖపట్నంలో రూ. లక్షా 40 వేల కోట్లతో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. ఏపీని అభివృద్ధి చేయడానికి రీజియన్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రపంచంలోనే అందమైన నగరంగా అమరావతి నిర్మాణం చేస్తాం. వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు జనవరిలోగా మరమ్మతులు చేస్తాం. ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంజీవిని పథకం తీసుకువస్తాం. గత జగన్ ప్రభుత్వ పాలన రాష్ట్రాన్ని దెబ్బతీసింది. గత వైసీపీ ప్రభుత్వంలో గంజాయిపై ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదు. గంజాయి అందరికీ అలవాటై లేడీ డాన్‌లు పుట్టుకువచ్చారు. రాయలసీమలో ముఠాలు లేవు. నేరాలు ఉన్నాయి. రాష్ట్రంలో బాబాయ్‌ను గొడ్డలిపెట్టుతో లేపేసేవారు ఉన్నారు. దేవాలయాలు, ప్రార్థన మందిరాల వైపు వస్తే అదే చివరి రోజు కావాలి. తిరుపతిలో అదే అంశంపై మాట్లాడితే నాపై దాడికి కొంతమంది ప్రయత్నించారు. వేంకటేశ్వరస్వామి సాక్షిగా నేను బయటపడ్డాను. ఏదైనా పని మీద ఇష్టపడి, కష్టపడితే విసుగు ఉండదు. కొందరు నటిస్తారు.. అది నటనకే పరిమితం అవుతుంది’ అని సీఎం చంద్రబాబు విమర్శించారు.
ఏలూరు కలెక్టర్ పనితీరుపై సీఎం అసంతృప్తి
ఏలూరు కలెక్టర్ పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వయంగా తానే గ్రామసభ నిర్వహిస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రజాసమస్యలపై సిబ్బంది కనీస అవగాహన లేకుండా గ్రామసభకు ఎలా వచ్చారని కలెక్టర్ వెట్రి సెల్వినినీ సీఎం ప్రశ్నించారు. ఒక గ్రామంలో ఎన్ని టాయిలెట్స్, ఎన్ని ఇళ్లు ఉన్నాయనే కనీస అవగాహన లేకుండా గ్రామసభకు ఎలా వచ్చారని ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం మొక్కుబడిగా గ్రామసభలు నిర్వహించడం లేదని మండిపడ్డారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల ఆదాయం పెరిగే విధంగా అధికారులు ఆలోచించాలని సూచించారు. అధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా ఉండవద్దని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
ఉదయం 9 గంటలకే 62.40 శాతం పింఛన్ల పంపిణీ
పరకామణి కేసు.. విచారణ పూర్తి.. రేపు హైకోర్టుకు నివేదిక
Read Latest AP News And Telugu News