Share News

Nara Lokesh in Visakhapatnam: విశాఖలో లోకేశ్ పర్యటన.. సీఎల్‌ఎస్‌కు శంకుస్థాపన

ABN , Publish Date - Oct 12 , 2025 | 01:35 PM

విశాఖపట్నంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు శంకుస్థాపనలు చేశారు.

 Nara Lokesh in Visakhapatnam: విశాఖలో లోకేశ్ పర్యటన.. సీఎల్‌ఎస్‌కు శంకుస్థాపన

విశాఖపట్నం, అక్టోబర్ 12: విశాఖకు మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ తరలివచ్చింది. దేశ కృత్రిమ మేధ సాధికారత దిశగా విశాఖలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS)కు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. భీమిలి నియోజకవర్గం రుషికొండ, మధురవాడ ఐటీ పార్క్‌లోని హిల్ నెంబర్ 3లో సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ (Sify Infinit Spaces Limited) ఏర్పాటు చేయబోయే 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్‌తోపాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు ఆయన శంకుస్థాపన చేశారు.

అంతకుముందు మధురవాడ ఐటీ పా‌ర్క్‌కు చేరుకున్న మంత్రి నారా లోకేష్‌కు మంగళ వాయిద్యాలతో నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ తోపాటు, రుషికొండలో ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు ఆయన శంకుస్థాపన చేసి.. శిలాఫలకాలను ఆవిష్కరించారు.


ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్ రాక వల్ల భారతదేశ తదుపరి గ్లోబల్ డిజిటల్ గేట్ వేగా విశాఖ రూపుదిద్దుకోవడంతోపాటు సముద్రపు కేబుల్ కనెక్టివిటీ, ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయనుంది. నాస్ డాక్‌లో నమోదైన దేశ ప్రముఖ డిజిటల్ ఐసీటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్.. ప్రభుత్వం కేటాయించిన 3.6 ఎకరాలలో రూ.1,500 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఏఐ ఎడ్జ్ డేటా సెంట‌ర్‌ను అభివృద్ధి చేయనుంది. తద్వారా వెయ్యి మందికి‌పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. నూతన కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS) సదుపాయం వల్ల సముద్రపు కేబుల్ కనెక్టివిటీ మెరుగుపడనుంది.


ఈ కార్యక్రమంలో సిఫీ చైర్మన్ రాజు వేగేశ్న, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ హర్షా రామ్, రాజేష్ తిరుమల రాజు, సిఫీ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ చెన్నకేశవ్‌తోపాటు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పెన్మత్స విష్ణుకుమార్ రాజు, పి.గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, గంటా రవితేజ, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, ఐటీసీ అండ్ ఈ సెక్రటరీ కాటంనేని భాస్కర్, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్, విశాఖ కలెక్టర్ హరీంద్రప్రసాద్ తదితర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!

ట్విస్ట్ ఇచ్చిన వైద్య సిబ్బంది.. ఏఐజీ వద్ద ఉద్రిక్తత

రెచ్చిపోయిన కానిస్టేబుల్ దంపతులు.. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

For More AP News And Telugu News

Updated Date - Oct 12 , 2025 | 03:23 PM