AP Heavy Rains: ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపు భారీ వర్షాలు..
ABN , Publish Date - Oct 03 , 2025 | 07:19 AM
ఒడిశాలో కురిసిన వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో వరద ఉద్ధృతి పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయ నదులకు వరద తీవ్రంగా ప్రవహిస్తోందని తెలిపారు.
విశాఖపట్నం: దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాకు ఆనుకొని ఉన్న గోపాల్‌పూర్ సమీపంలో తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ.. బలహీనపడుతోందని పేర్కొంది. ఈ మేరకు ప్రస్తుతం ఉత్తరకోస్తా జిల్లాల్లో.. వర్షం తగ్గుముఖం పట్టినట్లు సమాచారం. అయితే.. రేపు(శనివారం) పలుచోట్ల చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు బాంబు పేల్చింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరికి, శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో ఉన్న నదులకు ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అయితే ఇప్పటికే.. ఒడిశాలో కురిసిన వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో వరద ఉద్ధృతి పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయ నదులకు వరద తీవ్రంగా ప్రవహిస్తోందని తెలిపారు. ఈ మేరకు గొట్టా బ్యారేజీ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. గొట్టా బ్యారేజీ నుంచి వచ్చిన వంశధార నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
నాగావళి, మహేంద్రతనయ నదులలో వరద ప్రవాహం పెరుగుతోంది. వరద ఉద్ధృతికి పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్, మహేంద్రనగర్ వీధిలోకి వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సహాయం కోసం శ్రీకాకుళం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఏదైనా సమస్య తలెత్తితే కంట్రోల్ రూమ్: 08942-24055 నెంబర్‌కు సమాచారం ఇవ్వలని అధికారులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Ind-China Flight Service: కుదిరిన అంగీకారం.. భారత్, చైనా మధ్య ఈ నెలాఖరు నుంచీ..
President Murmu At Red Fort Dasara: ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్