Fishing Harbor Blast: ఫిషింగ్ హార్బర్‌లోని బ్లాస్ట్ ఘటనలో ఇద్దరు మృతి.. సంతాపం తెలిపిన హోం మంత్రి
ABN , Publish Date - Aug 07 , 2025 | 08:07 PM
బ్లాస్ట్ ఘటనలో తీవ్ర గాయాలతో నలుగురు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వివరించారు. వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని పేర్కొన్నారు. గాయాల శాతం అధికంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారని అన్నారు.
విశాఖ : ఫిషింగ్ హార్బర్ సమీపంలోని వెల్డింగ్ షాపు పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వెల్డింగ్ షాప్ ఓనర్ గణేష్‌తో సహా శ్రీను అనే మరో వ్యక్తి మృతి చెందినట్లు పేర్కొన్నారు.
విషయం తెలుసుకున్న విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఇద్దరు చనిపోయారు.. మరో నలుగురు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ నుంచి బాధిత కుటుంబాలకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. గ్యాస్ బండ పేలుడు వల్లే ప్రమాదం సంభవించినట్లు తెలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తీవ్ర గాయాలతో నలుగురు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వివరించారు. వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని పేర్కొన్నారు. గాయాల శాతం అధికంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారని అన్నారు. క్షతగాత్రులను.. చింతకాయల ముత్యాలు(27), ఎర్ర ఎల్లజి (45), టి.సన్యాసి (46), టి.సన్యాసి (46)లుగా గుర్తించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
తాజాగా.. ఘటనపై హోం మంత్రి అనిత స్పందించారు. నగర పోలీస్ కమిషనర్, ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు హోం మంత్రి అనిత ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఏపీలో అనుకోని ప్రమాదం... అప్రమత్తమైన అధికారులు
మంగళగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన.. మూడు పథకాలకు శ్రీకారం