Share News

AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. మరోసారి భారీ వర్షాలు..

ABN , Publish Date - Oct 08 , 2025 | 05:16 PM

ద్రోణి ప్రభావంతో ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రెండు రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని, అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. మరోసారి భారీ వర్షాలు..
Rain Alert

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి మన్నార్ గల్ఫ్ వరకు.. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్లు ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు.


ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రెండు రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని, అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అలాగే ఇవాళ పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసినట్లు తెలిపారు. తిరుపతి జిల్లా దక్కిలిలో 77.2మిమీ, అల్లూరి జిల్లా అరకులో 61మిమీ, నెల్లూరు జిల్లా దగదర్తిలో 57.7మిమీ, బాపట్ల జిల్లా రామకూరులో 56.5మిమీ, అనకాపల్లి జిల్లా పాములవాకలో 48.5మిమీ, కడప జిల్లా పులివెందులలో 45.5మిమీ వర్షపాతం నమోదైందని ఆయన పేర్కొన్నారు.


రేపు(గురువారం) కూడా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దూర ప్రయాణాలు రద్దు చేసుకోవాలని పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే అధికారులకు సమచారం ఇవ్వాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.


Also Read:

కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ ఫ్రైజ్..

మాజీ సీఎం జగన్‌పై కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఫైర్..

అభ్యర్థుల ఖరారుకు బీజేపీ కీలస సమావేశం

Updated Date - Oct 08 , 2025 | 06:08 PM