Minister Atchannaidu: రైతాంగం అభివృద్ధిపై జగన్ ఓపెన్ డిబేట్‌కు సిద్ధమా..?
ABN , Publish Date - Sep 10 , 2025 | 08:30 PM
గత వైసీపీ పాలనలో ఎరువుల కొరత తీవ్రంగా ఉండేదని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. కూటమి పాలనలో పారదర్శకంగా ఎరువుల పంపిణీ చేపడుతున్నట్లు చెప్పారు.
అమరావతి: వ్యవసాయ శాఖ, రైతాంగం అభివృద్ధిపై మాజీ సీఎం జగన్ ఓపెన్ డిబేట్‌కు సిద్ధమా..? అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంపై జగన్ ఆరోపణలు విచిత్రంగా ఉన్నాయని విమర్శించారు. రైతు పేరు చెప్పడానికి జగన్ అర్హుడు కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో రైతులు నరకం చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతి అడుగు రైతు పక్షానే ఉంటుందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎరువులు, విత్తనాలు సమయానికి రైతులకు అందచేశామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
గత వైసీపీ పాలనలో ఎరువుల కొరత తీవ్రంగా ఉండేదని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. కూటమి పాలనలో పారదర్శకంగా ఎరువుల పంపిణీ చేపడుతున్నట్లు చెప్పారు. వ్యవసాయ రంగంలో ధరల స్థిరీకరణ పేరుతో జగన్ రూ.7800 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు. రైతుల పంటలు కొనకుండా అబద్ధాలతో తప్పుదారి పట్టించారని మండిపడ్డారు.
కూటమి పాలనలో ఉల్లి, టమోటా, మామిడి, మిరప, పొగాకు, మిర్చి పంటలకు మద్దతు ధర ప్రకటించినట్లు పేర్కొన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లో ఖాతాల్లో నగదు జమ చేసినట్లు తెలిపారు. గత వైసీపీ పాలనలో పంట బీమా మోసాలు ఉంటే.. కూటమి పాలనలో పంట నష్టానికి వెంటనే బీమా చెల్లింపులు ఉన్నాయన్నారు. రైతులు వైసీపీని మర్చిపోయారని విమర్శించారు. అన్నదాత పోరులో రైతులే లేరని మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..