Andhra Pradesh Assembly: వైసీపీ హయాంలోని ఇళ్ల స్థలాలపై అసెంబ్లీలో వాడివేడీ చర్చ...
ABN , Publish Date - Sep 27 , 2025 | 12:33 PM
మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వైసీపీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మార్కాపురం పట్టణానికి 8 కిలోమీటర్లు దూరంలో ఒక లే అవుట్, 10కిలో మీటర్లు దూరంలో మరో లేఅవుట్ వేశారని పేర్కొన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై చర్చ జరిగింది. దీనిపై నియోజకవర్గం వారిగా.. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వారి స్వరం వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడారు.. గత సీఎం జగన్ సెంటు భూమి పేదలకు ఇచ్చి.. తన కారు గ్యారేజికి 3సెంట్లు భూమిని కేటాయించుకున్నారని ఆరోపించారు. కనిగిరి మండలంలో ఇచ్చిన సెంటు భూమి ఊరికి చివరన ఇచ్చారని గుర్తు చేశారు. జ్యోతిరావు పూలే స్కూలుకు స్థలం అడిగితే వాటర్ బాడీస్ అని ఇవ్వడానికి వీల్లేదు అన్నారని మండిపడ్డారు. కొన్ని గ్రామాల్లో ఒక సెంటు పేదలకు ఇచ్చి, మూడు సెంట్లలో వైసీపీ నాయకులు ఇళ్లు కట్టుకున్నారని మండిపడ్డారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన అసెంబ్లీలో కోరారు.
అనంతరం మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వైసీపీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మార్కాపురం పట్టణానికి 8 కిలోమీటర్లు దూరంలో ఒక లే అవుట్, 10 కిలో మీటర్లు దూరంలో మరో లేఅవుట్ వేశారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదలను మోసం చేసిందని విమర్శించారు. వైసీపీ ఇచ్చిన ఇళ్లలో స్కామ్‌లు, అవినీతి తప్ప ఏమి లేదని విమర్శించారు. వైసీపీ నాయకులు ఆ ఇళ్లను, స్థలాలను బ్లాక్‌లో అమ్ముకున్నారని ఆరోపించారు. సత్తెనపల్లిలో నివాసయోగ్యం కాని చోట సెంటు భూమి ఇచ్చారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. అక్కడి వారి వద్ద నిరుపయోగంగా ఉన్న భూమి తీసుకొని వేరే చోట ఇస్తారా.. అని నిలదీశారు. వైసీపీ పేదలకు ఇచ్చిన భూముల్లో రాళ్లు, రప్పలు ఉన్నాయని ఎమ్మెల్యే మాధవీ రెడ్డి మండిపడ్డారు. అవేవి చూడకుండా.. గత నాయకులు వారి స్వలాభం కోసం రిజిష్ట్రేషన్‌లు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించి బాధితులకు ప్రత్యమ్నాయ స్థలాలు చూపాలని ఆమె కోరారు.
ఎమ్మెల్యేల వాదనలు విన్న.. మంత్రి కొలను పార్థసారథి సమాధానం ఇచ్చారు. ఎన్టీఆర్ హౌసింగ్ ఇళ్లను గత ప్రభుత్వం రద్దు చేసిందని పేర్కొన్నారు. కొన్ని చోట్ల 25 కిలోమీటర్లు దూరంలో కూడా గత వైసీపీ ప్రభుత్వం ఇళ్లను ఇచ్చిందని ఆరోపించారు. త్వరలోనే లబ్ధిదారులతో మాట్లాడి వారి ఇష్టపూర్వకంగా ఆస్థలాలకు ప్రత్యమ్నాయం చూపాలని భావిస్తున్నామని మంత్రి పార్థసారథి వివరించారు.
ఇవి కూడా చదవండి
వెలిగొండ ఫీడర్ కాలువ లైనింగ్‌కు రూ.456 కోట్లు