AP Rains: ఏపీకి భారీ వర్ష సూచన.. క్రమంగా పెరగనున్న వర్షాలు
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:03 PM
వాయుగుండం ఆంధ్రప్రదేశ్ తీరం దిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు.
విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో వాయుగుండం ఉగ్రరూపం దాల్చనున్నట్లు పేర్కొంది. అలాగే 48 గంటల్లో తుఫాన్‌గా మారేటువంటి అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోందని వివరించింది. ప్రస్తుతం విశాఖపట్నంకి 990 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది.
ఈ వాయుగుండం ఆంధ్రప్రదేశ్ తీరం దిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పొడి వాతావరణం ఉందని చెప్పారు. ఇవాళ(శనివారం) అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వివరించారు. రేపటి(ఆదివారం) నుంచి క్రమంగా వర్షాలు పెరుగుతాయని అధికారులు వెల్లడించారు.
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు పడే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
కర్నూలు అగ్ని ప్రమాదం.. వందల ఫోన్లు పేలడమే ప్రధాన కారణమా!
నాగుల చవితి.. తెల్లవారే పుట్టలో పాలు పోసిన మండలి బుద్ధ ప్రసాద్