AP Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..
ABN , Publish Date - Oct 02 , 2025 | 04:27 PM
విశాఖలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో.. పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల చెట్లు, హోర్డింగ్స్ నేలకొరిగాయి. రహదారులు జలమయం అయ్యాయి.
విశాఖ: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి. కాగా, విశాఖకు 300 కి.మీ. దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతం అయిందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ (గురువారం) రాత్రికి గోపాల్‌పూర్-పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఉత్తరకోస్తా జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. అలాగే.. దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.
అయితే ఇప్పటికే విశాఖలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో.. పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల చెట్లు, హోర్డింగ్స్ నేలకొరిగాయి. రహదారులు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలిపిస్తున్నాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్ష కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. GVMC కార్యాలయం, చినవాల్తేరు, ఈస్ట్‌పాయింట్ కాలనీలో చెట్లు కూలినట్లు సమాచారం. ఈ మేరకు వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఏదైనా సమస్య తలెత్తితే.. విశాఖ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 0891 2590 100, 0891 2590 102 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
విశాఖతోపాటు శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా భారీ వర్షం దంచికొడుతోంది. దీంతో వంశధార, నాగావళి నదుల్లో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమదాలవలస, బూర్జ, ఎచ్చెర్ల మండలాల్లో 11 గ్రామాలకు వరదముప్పు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సహాయం కోసం శ్రీకాకుళం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 08942 240557 నంబర్ కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. భారీ వర్షం కారణంగా.. అల్లూరి జిల్లా అరకులోయ ఘాట్ రోడ్డుకు అడ్డంగా చెట్టు విరిగి పడింది. దీంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమచారం అందుకున్న అధికారులు వెంటనే చెట్టును తొలగించేందుకు చర్యలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్జ్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి 55-75 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఏపీకి భారీ వర్ష సూచన మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏండీ ప్రఖర్ జైన్ మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు ప్రయాణాలు చేయకూడదని సూచించారు. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని తెలిపారు. వర్షాలు కురుస్తున్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఏదైనా సమస్య వస్తే.. వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ఏండీ ప్రఖర్ జైన్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధర తగ్గేదేలే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
టాప్ ప్లేస్‌లో అంబానీ.. దేశంలో అత్యంత సంపన్నులు వీరే..