Share News

AP News: త్వరలో మున్సిపాలిటీగా.. పీలేరు

ABN , Publish Date - Sep 26 , 2025 | 01:12 PM

ప్రస్తుతం మేజర్‌ గ్రామ పంచాయతీగా ఉన్న పీలేరు త్వరలో మున్సిపాలిటీగా అవతరించనున్నట్లు తెలుస్తోంది. దినాదినాభివృద్ధి చెందుతున్న పీలేరును అభివృద్ధి పథంలో నిలపాలంటే మున్సిపాలిటీగా చేయక తప్పదనే అభిప్రాయంతో ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారని టీడీపీ నాయకులు చెబుతున్నారు.

 AP News: త్వరలో మున్సిపాలిటీగా.. పీలేరు

- ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసిన ఎమ్మెల్యే నల్లారి

- మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యంలోనూ పరిశీలన

పీలేరు(అన్నమయ్య): ప్రస్తుతం మేజర్‌ గ్రామ పంచాయతీగా ఉన్న పీలేరు త్వరలో మున్సిపాలిటీగా అవతరించనున్నట్లు తెలుస్తోంది. దినాదినాభివృద్ధి చెందుతున్న పీలేరును అభివృద్ధి పథంలో నిలపాలంటే మున్సిపాలిటీగా చేయక తప్పదనే అభిప్రాయంతో ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారని టీడీపీ(TDP) నాయకులు చెబుతున్నారు. భౌగోళికంగా, జనాభా పరంగా, ఆర్థికపరంగా ఏనాడో మున్సిపాలిటీ స్థాయికి చేరుకున్న పీలేరు గ్రామ పంచాయతీ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా మున్సిపాలిటీ కాలేకపోయిందని, పెరుగుతున్న అవసరాల దృష్ట్యా దానిని మున్సిపాలిటీగా మార్చక తప్పడం లేదని వారు అభిప్రాయపడుతున్నారు.


జిల్లాలో ఏకైక మేజర్‌ పంచాయతీ

ప్రస్తుత అన్నమయ్య జిల్లాలో పీలేరు గ్రామ పంచాయతీ ఏకైక మేజర్‌ పంచాయతీగా ఉంది. గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దినాదినాభివృద్ధి చెందిన పంచాయతీల్లో ఒకటిగా ఉండేది. చిత్తూరు, మదనపల్లె, తిరుపతి, రాయచోటి పట్టణాలకు సమాన దూరంలో (58 కిలోమీటర్లు) ఉన్న పీలేరులో స్థానికులే కాకుండా పొరుగున ఉన్న సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం, కలికిరి, కలకడ, కేవీపల్లె మండలాలకు చెందిన వేలాది మంది ప్రజలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. విద్య, వ్యాపార కూడలిగా మారడంతో ప్రతిరోజూ వివిధ అవసరాల కోసం పీలేరుకు సుమారు 3 వేల మంది వచ్చి వెళుతుంటారని అంచనా.


పీలేరు గ్రామ పంచాయతీ రికార్డుల మేరకు ప్రస్తుతం పంచాయతీలో ఇంటి పన్నులు చెల్లిస్తున్న ఇళ్ల సంఖ్య 11,130 కాగా పన్నులు చెల్లించకుండా మరో 6 వేల ఇళ్ల వరకు ఉన్నాయని అంచనా. 2011 జనాభా లెక్కల ప్రకారం పీలేరు పట్టణంలో 41,256 మంది జనాభా ఉండగా ప్రస్తుతం అది 60 వేలు దాటి ఉంటుందని అంచనా. అంతేకాకుండా భౌగోళికంగానూ పీలేరు పట్టణం సుమారు 4 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దీంతో పరిపాలనా సౌలభ్యంతో పాటు అభివృద్ధి పనుల నిధుల కోసం పంచాయతీని మున్సిపాలిటీ చేయక తప్పని పరిస్థితి నెలకొందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.


pandu2.2.jpg

నాలుగు పంచాయతీలతో...

పీలేరు పట్టణంతో కూడిన పీలేరు గ్రామ పంచాయతీతో పాటు పొరుగున ఉన్న బోడుమల్లువారిపల్లె, దొడ్డిపల్లె, ఎర్రగుంట్లపల్లె గ్రామ పంచాయతీలతో కలిపి పీలేరు మున్సిపాలిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. పీలేరు-కడప మార్గంలోని బోడుమల్లువారిపల్లె బ్రిడ్జి, పీలేరు-మదనపల్లె మార్గంలో ఉన్న బడబళ్లవంక బ్రిడ్జి, పీలేరు-తిరుపతి మార్గంలో హెరిటేజ్‌ ఫ్యాక్టరీ వద్ద ఉన్న బ్రిడ్జి, పీలేరు-సదుం మార్గంలో దొడ్డిపల్లె పంచాయతీలోని కొత్తపేట గ్రామాన్ని కలుపుకుని పీలేరు మున్సిపాలిటీ ఏర్పాటు చేయవచ్చునని ప్రాథమిక ప్రతిపాదనలు తయారు చేసినట్లు తెలుస్తోంది.


ఆ మేరకు పట్టణ విస్తీర్ణం, జనాభా, ఆదాయం వంటి సాంకేతిక అంశాలు కలిసి వస్తాయని అధికార పార్టీ వర్గాలు ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణకు ప్రతిపాదనలు అందజేశారు. ఆయన ప్రతిపాదనలపై వారిద్దరూ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. పీలేరు వ్యవహారాలపై బాగా పట్టున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే ప్రతిపాదనపై హర్షం వ్యక్తం చేసినట్లు తెలిసింది.


pandu2.3.jpg

ఏడాదికి రూ.5 కోట్ల ఆదాయం

మేజర్‌ పంచాయతీ కావడంతో ప్రస్తుతం పీలేరుకు ఏడాదికి రూ.5 కోట్ల మేర ఆదాయం ఉంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు, వేలం పాటలు, వివిధ పన్నుల వసూళ్ల రూపంలో ఆ ఆదాయం సమకూరుతోంది. అయితే నానాటికీ పెరిగిపోతున్న పట్టణ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు చాలడం లేదన్న అభిప్రాయం అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారుల్లోనూ ఉంది. రోజురోజుకు పట్ణణంలో స్థిరపడుతున్న వారి సంఖ్య, ఏర్పాటవుతున్న కాలనీలు పెరుగుతుండడంతో వాటిలో మౌలిక వసతులు కల్పించడం అధికారులు, ప్రజాప్రతినిధులకు కత్తి మీద సాములా మారింది. పట్టణం పెరుగుతున్న కొద్దీ పక్కనున్న పంచాయతీల పరిధిలోకి విస్తరిస్తుండడం, ఆ పంచాయతీలకు ఆదాయం వెళుతుండడంతో పీలేరుకు ఆదాయం తగ్గుతోంది. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు మున్సిపాలిటీ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.


అభివృద్ధి కోసమే మున్సిపాలిటీ ప్రతిపాదన

రోజురోజుకు పెరుగుతున్న పీలేరును అభివృద్ధి చేయడానికే మున్సిపాలిటీ ప్రతిపాదనలు చేశాం. మా అన్న నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పీలేరును మున్సిపాలిటీ చేయాలని ప్రయత్నించినప్పటికీ సాంకేతిక కారణాలతో చేయలేకపోయాం. ఇప్పుడు అన్నింటినీ కూలంకషంగా అధ్యయనం చేసి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. పీలేరును మున్సిపాలిటీ చేసేందుకు రాష్ట్ర మున్సిపల్‌ శాఖ కూడా పరిశీలన చేస్తుండడం పీలేరుకు కలిసి వచ్చే అంశం. మున్సిపాలిటీలకు పెద్దఎత్తున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు వస్తాయి. తద్వారా అభివృద్ధి పనులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. త్వరలో పీలేరులో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలను కూడా చైతన్యవంతులను చేస్తాం.

- నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్యే


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం, కానీ వెండి రేట్లు మాత్రం..

కాంగ్రెస్ చిల్లర వేషాలు వేస్తోంది.. ఎంపీ అర్వింద్ ఫైర్

Read Latest Telangana News and National News

Updated Date - Sep 26 , 2025 | 01:12 PM