Share News

AP NEWS: నెల్లూరు జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతానికి ఇద్దరి మృతి

ABN , Publish Date - Jun 03 , 2025 | 09:04 AM

నెల్లూరు జిల్లాలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు డ్రైవర్లు మృతిచెందారు. ఈ సంఘటన విడలూరు మండలం ముదివర్తి గ్రామంలో జరిగింది. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

AP NEWS: నెల్లూరు జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతానికి ఇద్దరి మృతి
Electric Shock incident in Nellore District

నెల్లూరు: జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కరెంట్ షాక్‌తో (Electric Shock incident) ఇద్దరు డ్రైవర్లు మృతిచెందారు. ఈ ఘోర సంఘటన విడలూరు మండలం ముదివర్తి (mudivarthi) గ్రామంలో ఇవాళ( మంగళవారం) చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. రొయ్య పిల్లల లోడుతో రెండు కంటైనర్ లారీలు పాండిచ్చేరి గోల్డెన్ సీడ్ కంపెనీ నుంచి వచ్చాయి. పార్క్ చేస్తున్న సమయంలో లారీకి 11కేవీ కరెంట్ వైరు తగిలి డ్రైవర్ మృతిచెందాడు. అతని కాపాడే క్రమంలో మరో డ్రైవర్‌కి కూడా విద్యుత్ షాక్ కొట్టడంతో చనిపోయాడు. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాండిచ్చేరి గోల్డెన్ సీడ్ కంపెనీకి చెందిన రెండు కంటైనర్ లారీలు రొయ్య పిల్లల లోడుతో ముదివర్తి గ్రామానికి చేరుకున్నాయి. లారీలు పార్క్ చేసే సమయంలో అనుకోకుండా 11 కేవీ విద్యుత్ లైన్ లారీపై భాగాన్ని తాకింది. ఈ ప్రమాదంలో మొదటి డ్రైవర్‌కు కరెంట్ షాక్ తగిలింది. తన సహచరుడిని కాపాడటానికి ప్రయత్నించిన మరో లారీ డ్రైవర్‌కి కూడా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించారు. కొద్దినిమిషాల్లోనే రెండు కుటుంబాలు ఇద్దరిని కోల్పోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న నెల్లూరు జిల్లా పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ల పూర్తి వివరాలను తెలుసుకునే పనిలో ఉన్నామని, వారి కుటుంబాలను సమాచారం ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.


కాగా, ఇటీవల విద్యుత్ సంబంధిత ప్రమాదాలు తరచూ జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రహదారుల వెంట తక్కువ ఎత్తులోని విద్యుత్ లైన్లు, తగిన రక్షణ చర్యలు లేని కారణంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనతో స్థానికులు విద్యుత్ శాఖ అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా అధిక వోల్టేజీ విద్యుత్ లైన్లకు భద్రతా చర్యలు, హెచ్చరిక బోర్డులు, నియమ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


రాజుపాలెం జాతీయ రహదారిపై ప్రమాదం..

మరో సంఘటనలో.. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఓజీలి మండలం రాజుపాలెం జాతీయ రహదారిపై టెంపో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ వాహనంలో 14 మంది ప్రయాణిస్తుండగా వారిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్థంభించిపోయింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పెద్దిరెడ్డి పిటిషన్‌పై కౌంటర్‌ వేయండి

తహసీల్దార్‌ కుటుంబం సేఫ్‌

For More AP News and Telugu News

Updated Date - Jun 03 , 2025 | 09:26 AM