Share News

Supreme Court: పెద్దిరెడ్డి పిటిషన్‌పై కౌంటర్‌ వేయండి

ABN , Publish Date - Jun 03 , 2025 | 05:56 AM

ఏపీ ప్రభుత్వంపై బుగ్గమఠం భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిటిషన్‌పై వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించింది.

Supreme Court: పెద్దిరెడ్డి పిటిషన్‌పై కౌంటర్‌ వేయండి

  • బుగ్గమఠం భూముల వ్యవహారంపై ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): బుగ్గమఠం భూముల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీచేసింది. మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిటిషన్‌పై వారం రోజుల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అదేవిధంగా ఆ కౌంటర్‌కు వారం రోజుల్లో రిజాయిండర్‌ దాఖలు చేయాలని పెద్దిరెడ్డికి న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. అప్పటి వరకు భూములపై యధాతథ స్థితి కొనసాగించాలని జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్‌ మరోసారి ఆగస్టు 5న విచారణకు వచ్చే అవకాశముంది. తిరుపతి నగరంలోని ఎమ్మార్‌ పల్లి పరిధి సర్వే నంబరు 261/1లో 1.50 ఎకరాలు, 261/2లో 2.38 ఎకరాలు బుగ్గమఠానికి చెందిన భూములను పెద్దిరెడ్డి ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, వాటిని పది రోజుల్లో ఖాళీ చేయాలని పేర్కొంటూ ఈవో గతంలో ఉత్తర్వులిచ్చారు. వీటిని సవాలు చేస్తూ పెద్దిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆక్రమిత భూమిని ఖాళీ చేయాలని, అందులోని నిర్మాణాలను తొలగించాలని మఠం ఈవో/అసిస్టెంట్‌ కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరాలు ఉంటే ఎండోమెంట్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని హైకోర్టు ఆదేశించింది.


హైకోర్టు తీర్పును మాజీ మం త్రి పెద్దిరెడ్డి గత నెల 28న సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఆ పిటిషన్‌పై సోమవారం విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ్‌ లూథ్ర, పిటిషనర్‌ తరఫున ముకుల్‌ రోహిత్గి వాదనలు వినిపించారు. ఈవో/అసిస్టెంట్‌ కమిషనర్‌ ఉత్తర్వులపై ఎండోమెంట్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని, విషయాన్ని హైకోర్టు స్పష్టం చేసిందని సిద్దార్థ్‌ లూథ్ర పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ధర్మాసనం పై మేరకు ఆదేశాలు ఇచ్చింది.

Updated Date - Jun 03 , 2025 | 06:00 AM