TDP: విజయసాయి రాజీనామాపై టీడీపీ నేతలు ఏమన్నారంటే
ABN , Publish Date - Jan 24 , 2025 | 08:46 PM
TDP Leaders: వైసీపీ నేత, విజయసాయిరెడ్డి రాజీనామాపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉందని అన్నారు.
అమరావతి: వైఎస్ జగన్ ముఖ్య అనుచరుడు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా విజయసాయి రెడ్డి.. ఇదే తన చివరి ట్వీట్ అని తెలిపారు. అయితే విజయసాయి రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం.. ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ విషయంపై టీడీపీ నేతలు స్పందించారు. వైసీపీ నేత, విజయసాయిరెడ్డి రాజీనామాపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయసాయి రెడ్డి పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉందని అన్నారు. సేద్యం చేస్తానంటున్నావ్..దోచేసిన నల్లడబ్బుతో చేస్తావా..ఏంటీ అని ప్రశ్నించారు. ఇప్పుడు నువ్వు సేద్యంలో దిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఎవరూ పూడుస్తారని ప్రశ్నించారు. 2004 నుంచి 2009 వరకు అప్పటి సీఎం కుమారుడిని ముందు పెట్టి ఏ2గా సకల పాపాలు చేశావని విమర్శించారు. గత ఐదేళ్లూ అరాచక పాలనకు, దోపిడీకి రైట్ హ్యాండ్‌గా నిలిచి ఏ2 స్థానాన్ని కొనసాగించావని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆక్షేపించారు.
పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామా చేస్తానంటే పరిహారం జరిగేదెట్టా అని నిలదీశారు. ముందు అప్పుడు దోచుకున్న రూ.43 వేల కోట్లతో పాటు మొన్న ఐదేళ్లలో జగన్ రెడ్డితో కలిసి దోచేసిన రూ.లక్ష కోట్ల ప్రజల సొత్తు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దోచేసిన మొత్తం పాపపు సొత్తు ఎక్కడుందో చెప్పు...అప్పుడైనా నిన్ను భగవంతుడు క్షమించే అవకాశం ఉందని అన్నారు. మొత్తంగా చూస్తే చేసిన పాపాలకు సంబంధించిన కేసుల భయం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. అంతేనా లేక నీతో పాటు నీ అల్లుడి కంపెనీ అరబిందోను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నావా అని నిలదీశారు. ఈ రాజీనామాల పరంపరం ఒక్క విజయసాయిరెడ్డితో ఆగేటట్లు కూడా లేదన్నారు. రాత్రికో, రేపు రాత్రి లోపల మరో ఒకరిద్దరు వైసీపీ నేతలు కూడా రాజీనామా చేసినా ఆశ్చర్యపోనక్కరలేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే వైసీపీ నాశనం: డొక్కా మాణిక్యవరప్రసాద్

గుంటూరు జిల్లా : ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు రావడం స్వాగతిస్తున్నానని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం హర్షనీయమని చెప్పారు. ఆంధ్ర శశికళ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వల్లనే ఆ పార్టీ నాశనం అవుతుందని ఆరోపించారు. సజ్జల పెట్టే మానసిక క్షోభ వల్ల వైసీపీలో ఇమడలేక ఆ పార్టీ నేతలు బయటకు వస్తున్నారని చెప్పారు. టీడీపీ, జనసేన పార్టీలు గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమన్నారు. వైసీపీ నాయకులు కూటమి పార్టీలోకి వెళ్లడానికి ఆసక్తిగా ఉన్నారని డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP News: ఈ బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత కల్పించండి: సీఎంచంద్రబాబు..
Visakha: కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టుకు శ్రీను.. మరి జగన్ వెళ్లారా..
Supreme Court: వైసీపీ నేత గౌతంరెడ్డికి సుప్రీంలో ఊరట
Read Latest AP News and Telugu News